బంజారాహిల్స్, అక్టోబర్ 18: నాలుగేండ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన ఓ వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నం. 14లోని ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ వద్ద రజినీకుమార్ (36) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ స్కూల్లో చదువుతున్న బాలిక (4) పట్ల గత కొంత కాలంగా అతడు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు.
స్కూల్లోని డిజిటల్ క్లాస్ రూమ్‌లోకి తీసుకువెళుతూ.. అసభ్యకరమైన పనులు చేస్తుండటంతో ఆ బాలిక తీవ్ర ఆందోళనకు గురైనది. ఈ విషయాన్ని గుర్తించిన బాలిక తల్లి మంగళవారం ఆరా తీయగా దారుణం బయటపడింది. దీంతో స్కూల్‌వద్దకు చేరుకున్న బాలిక కుటుంబ సభ్యులతోపాటు మరి కొంతమంది పేరెంట్స్ రజినీకుమార్కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు నిందితుడు రజినీకుమార్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా.. గత కొంతకాలంగా రజినీకుమార్ మరి కొంతమంది చిన్నారుల పట్ల కూడా ఈ విధంగానే ప్రవర్తించినట్లు పోలీసులు గుర్తించారు.