బంజారాహిల్స్, జనవరి 10: వ్యాపారి ఇంట్లో లాకర్ తస్కరించిన కేసును బంజారాహిల్స్ పోలీసులు ఛేదించారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ సుదర్శన్, బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ నరేందర్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్ వివరాలను వెల్లడించారు. బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని ఎమ్మెల్యే కాలనీలో నివాసముంటున్న వ్యాపారి అరిహంత్ జైన్ ఇంట్లో ఈనెల 3న అర్ధరాత్రి సమయంలో చోరీ జరిగింది. అరిహంత్ జైన్ తల్లి బెడ్రూమ్లోని కప్‌బోర్డులో భారీ లాకర్‌ను దుండగులు తస్కరించారు. బాధితుడు 4న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లక్షలాది రూపాయల విలువైన వజ్రాభరణాలతో పాటు రూ.4.5లక్షల నగదు ఉన్న లాకర్ మాయమైనట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. రంగంలోకి దిగిన బంజారాహిల్స్ క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడి ఇంట్లో పనిచేస్తున్న 12 మంది సిబ్బందిని విచారించగా ఫలితం లభించలేదు. బాధితుడి ఇంట్లో 12 సీసీ కెమెరాలు ఉన్నాయి. సంఘటన జరిగిన రోజున అవి పనిచేయకపోవడంపై పోలీసులు దృష్టి సారించారు.
సీసీ కెమెరాల సహాయంతో..
సీసీ కెమెరాలకు సంబంధించిన డాటాను విశ్లేషించగా.. 3వ తేదీ సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. అతడు ఇంట్లోకి ప్రవేశించిన కొద్ది సేపటి నుంచే సీసీ కెమెరాలు పనిచేయలేదని తేలింది. ఇంట్లోకి వచ్చిన వ్యక్తి ఎవరనే విషయంపై ఆరా తీశారు. అతడు రాజస్థాన్‌కు చెందిన రామకిషన్ అలియాస్ రామకృష్ణ(31)గా గుర్తించారు. ఆ తర్వాత పనిమనుషులను విచారించగా.. ఆ ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న రాజస్థాన్‌కు చెందిన చంద్రశేఖర్(31) స్నేహితుడని తేలింది. పోలీసులు వెంటనే చంద్రశేఖర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా.. చోరీ జరిగిన తీరు బయటపడింది.
వాట్సాప్ కాలింగ్‌తో చోరీకి స్కెచ్..
యజమాని ఇంట్లో చోరీ చేసేందుకు చంద్రశేఖర్ ఆరు నెలలుగా ప్రయత్నిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తనపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు రాజస్థాన్‌లో ఉన్న స్నేహితుడు రామ్‌కిషన్‌ను రంగంలోకి దించాడు. రామకృష్ణకు వాట్సాప్ కాల్స్ ద్వారా యజమాని ఇంటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు పంపిస్తూ.. చోరీకి ప్లాన్ రచించాడు. ఈనెల 3న యజమాని ఇంటి వాచ్‌మన్ సెలవుపై వెళ్తున్న విషయాన్ని ముందుగానే తెలుసుకున్న చంద్రశేఖర్.. అదేరోజు రాజస్థాన్ నుంచి స్నేహితుడు రామ్‌కిషన్‌ను రప్పించాడు. స్నేహితుడి సూచనలతో ఇంట్లోకి ప్రవేశించిన రామ్‌కిషన్.. సెల్లార్లో ఉన్న సీసీ కెమెరాల కంట్రోల్ బోర్డు వద్దకు వెళ్లి స్విచాఫ్ చేశాడు. అక్కడే ఉన్న స్టోర్ రూమ్‌లో తలదాచుకున్నాడు.
అర్ధరాత్రి దాటిన తర్వాత ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం రామ్కిషన్తో పాటు చంద్రశేఖర్ మొదటి ఫ్లోర్లో ఉన్న యజమాని తల్లి గదిలోకి ప్రవేశించి, కప్‌బోర్డులో ఉన్న లాకర్‌ను తస్కరించారు. మూడో అంతస్తులో తనకు కేటాయించిన గదిలోకి లాకర్‌ను తరలించారు. లాకర్‌ను కట్ చేసేందుకు ప్రయత్నించి, విఫలమయ్యాడు. ఎవరికీ అనుమానం రాకుండా సర్వెంట్ గదుల ఎదుట ఉన్న చెప్పుల స్టాండ్ కింద లాకర్‌ను దాచిపెట్టారు. తెల్లవారుజామున రామ్‌కిషన్ గోడ దూకి బయటకు వెళ్లిపోయాడు.
5 రోజుల తర్వాత బయటపడిన ప్లాన్..
కేసు విచారణలో భాగంగా ఇంట్లో పనిచేస్తున్న వారిని విచారించిన పోలీసులు.. మరోవైపు చోరీకి పాల్పడిన వ్యక్తి ఆచూకీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎమ్మెల్యే కాలనీతో పాటు సమీపంలోని వందలాది సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. బాధితుడి ఇంటికి సమీపంలోనే ఉన్న ఓ ఆఫీస్‌కు సంబంధించిన సీసీ కెమెరాలో తెల్లవారుజాము 2.30 ప్రాంతంలో ఓ వ్యక్తి పారిపోతున్న దృశ్యం కనిపించింది. దీంతో సోమవారం సాయంత్రం మరోసారి అరిహంత్ జైన్ ఇంటిని పోలీసులు తనిఖీ చేశారు. మూడో అంతస్తులోని సర్వెంట్ క్వార్టర్స్ బయట ఉన్న చెప్పుల స్టాండ్ కింద లాకర్ కనిపించింది. అప్పటికే ఆ ఇంట్లో పనిచేస్తున్న చంద్రశేఖర్ పాత్ర కూడా బయటపడింది. దీంతో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. చోరీకి గురైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు రామ్‌కిషన్ పరారీలో ఉన్నాడు.