హైదరాబాద్ సిటీబ్యూరో, మే 17 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ వాడిన అత్యాధునిక ఐఫోన్‌లోని డాటాను, కీలక వీడియోలను డిలీట్ చేసినట్టు పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. అతను తన సోషల్ మీడియా అకౌంట్లను మాయం చేసినట్టు నిర్ధారించినట్టు సమాచారం. ఈ నెల 8న బండి భగీరథ్‌పై పేట్బషీరాబాగ్లో కేసు నమోదు కాగానే నిందితుడి సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. బండి భగీరథ్‌పై కేసు నమోదు నాటి నుంచి అరెస్ట్ వరకు హైడ్రామా, సాక్ష్యాల ధ్వంసానికి పాల్పడినట్టు ఇప్పటికే ఆరోపణలు రావడంతో, పోలీసులు కేసుకు సంబంధించిన కీలక సాక్ష్యాలను బయటకు తీస్తున్నట్టు సమాచారం.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ అస్ర్తాన్ని ప్రయోగించనున్నట్టు సమాచారం. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆ వెంటనే అతడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. తను వాడిన ఐఫోన్‌లోని డేటాను, కీలక వీడియోలను డిలీట్ చేయడం, సోషల్‌మీడియా అకౌంట్లను మాయంచేసి చట్టం నుంచి తప్పించుకోవచ్చని నిందితుడు భావించినట్టు పోలీసులు గుర్తించారని తెలిసింది. ఇందులో భాగంగానే ఫోన్‌ను పలుమార్లు ఫార్మాట్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ నిందితుడు ఎంత తెలివిగా సాక్ష్యాలను తారుమారు చేసినా అంతకంటే వంద రెట్లు పవర్ఫుల్ టెక్నాలజీతో పోలీసులు ఉచ్చు బిగించేందుకు సన్నాహాలు ఇప్పటికే మొదలు పెట్టినట్టు తెలిసింది. ఈ కేసులో కీలక సాక్ష్యాలు సేకరించేందుకు పోలీసులకు నిందితుడి ఫోన్ కీలకంగా మారింది.
ఐఫోన్ స్విచ్చాఫ్‌తో!
పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ ఫోన్ స్విచ్చాఫ్ కావడానికి ముందు ఎక్కడున్నాడు? ఎవరితో మాట్లాడాడు? చట్టం నుంచి అతనికి ఆశ్రయం కల్పించింది ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు సమాచారం. ఆ వివరాల కోసం సెల్‌టవర్ మ్యాపింగ్, కాల్‌డాటా రికార్డులను పోలీసులు సేకరిస్తున్నట్టు తెలిసింది. సాక్ష్యాలను నాశనం చేయడంలో నిందితుడికి సహకరించిన తెరవెనుక సూత్రధారులను కూడా ఈ మ్యాపింగ్ ద్వారా వెలుగులోకి తెచ్చేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది.
డిలీట్ అయిన డాటా రిట్రీవ్!
ఐఫోన్లో సెక్యూరిటీ ఫీచర్లు అత్యంత కఠినంగా ఉంటాయి. అందుకే నిందితులు ఐఫోన్లో డాటాను డిలీట్ చేస్తే పోలీసులు ఏమి చేయరనే ధీమాలో ఉంటారని పోలీసులు చెప్తున్నారు, కానీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నిపుణుల వద్ద అత్యంత ఆధునిక సాప్ట్వేర్లు అందుబాటులో ఉండటంతో వివిధమార్గాల ద్వారా డిలీట్ అయిన డాటాను రిట్రీవ్ చేసేందుకు అవకాశాలున్నాయని పోలీస్ వర్గాలు చెప్తున్నాయి. అడ్వాన్స్డ్ ఫోరెన్సిక్ టూల్స్‌తో సెలిబ్రైట్ వంటి అంతర్జాతీయ స్థాయిలో ఫోరెన్సిక్ సాఫ్ట్వేర్లు, ఐఫోన్‌లోని నంద ఫ్లాస్ మెమొరీ నుంచి డిలీట్ అయిన డాటాలోని చాటింగ్, వీడియోలు, ఫొటోలను రికవరీ చేసేందుకు తగిన మార్గాలున్నాయని పోలీసులు ధీమాతో ఉన్నారు.
ఐఫోన్‌లోని అంతర్గత మెమొరీని నిందితుడు పూర్తిగా ఫ్యాక్టరీ రీసెట్ చేసినా పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తేలేదని, ఐ క్లౌడ్‌లో బ్యాకప్ నుంచి కూడా డాటాను తిరిగి తీయొచ్చని చెప్తున్నారు. అవసరమైతే నిందితుడి క్లౌడ్ అకౌంట్ యాక్సెస్ కోసం కోర్టు ద్వారా యాపిల్ సంస్థను సంప్రదించేందుకూ సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఐక్లౌడ్ సర్వర్ల నుంచి నిందితుడికి సంబంధించిన ప్రతి డిజిటల్ ఆధారం డిలీట్ అయినా వాట్సాప్ బ్యాకప్‌లను, సోషల్‌మీడియా చాట్లను తిరిగి రాబట్టే అవకాశాలు కూడా లేకపోలేదని నిపుణులు పేర్కొంటున్నారు. సోషల్‌మీడియా అకౌంట్లను డిలీట్ చేసినా, వాటి సర్వర్ల నుంచి డాటాను సేకరించేందుకు సైతం పోలీసులు సిద్ధమవుతున్నారు.
రిసీవ్డ్ డాటా సైతం!
ఒకవేళ నిందితుడి ఫోన్ నుంచి సమాచారాన్ని రాబట్టడంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే, ఈ కేసులో పూర్తిసాక్ష్యాలను కోర్టు ముందు నిలబెట్టేందుకు పోలీసులు ప్లాన్ ‘బీ’ని కూడా అమలు చేసేందుకు సిద్ధమవున్నట్టు చర్చ జరుగుతుంది. ఈ కేసులో బాధితురాలి ఫోన్ సైతం మరో సాక్ష్యంగా మారనున్నదని పోలీస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. నిందితుడు బాధితురాలికి పంపిన బెదిరింపులు, మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు బాధితురాలి నుంచి సేకరించి, వాటిని ధ్రువీకరించుకొని రిసీవ్డ్ డాటాలో పటిష్టమైన ప్రాథమిక సాక్ష్యాలు కోర్టు ముందు ఉంచనున్నారని తెలుస్తున్నది. పోక్సో కేసులో సాక్ష్యాల తారుమారుకు ప్రయత్నించడం కూడా నేర తీవ్రతను మరింతగా పెంచుతుందని నిపుణులు చెప్తున్నారు.