సిటీబ్యూరో, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో(Rachakonda Commissionerate) మత పరమైన ఊరేగింపుల్లో(Religious processions) డీజే సౌండ్ సిస్టమ్(DJ sound system) వినియోగంపై నిషేధం పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీజే సౌండ్ల నుంచి అధిక డెసిబుల్స్‌లో వచ్చే శబ్ధాల కారణంగా హృద్రోగులకు గుండెపోటు, ఇతర హృదయ సంబంధిత ఇబ్బందులు వచ్చే ప్రమాదాలు ఉండడంతో పాటు చిన్న పిల్లలకు శాశ్వత వినికిడి సంబంధ సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయన్నారు.
ప్రధానంగా వృద్ధుల ఆరోగ్యం దెబ్బ తింటుందనే కారణంతో రాచకొండ కమిషనరేట్ పరిధిలోలో ఉరేగింపుల్లో డీజే సౌండ్ మిక్చర్లు, యాంప్లిఫయర్, బాణా సంచా ఉపయోగించడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ వివరించారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే బీఎస్ఎన్ 223, 280, 292, 293, 324, బీఎన్ఎస్ఎస్ 152, పర్యావరణ పరిరక్షణ చట్టం సెక్షన్ 15 కింద కేసులు నమోదు చేస్తామని, నిబంధనలు అతిక్రమించిన వారికి ఐదేళ్ల జైలు శిక్ష, లక్ష జరిమాన ఉంటుందని కమిషనర్ తెలిపారు. ప్రజలకు, విధుల్లో ఉండే అధికారులకు కల్గుతున్న ఇబ్బందులు, డీజీ సౌండ్ సిస్టమ్‌తో తలెత్తుతున్న సమస్యలను విశ్లేషించి అందరి అభిప్రాయాలను తెలుసుకున్న తరువాత ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు.