Trade Licence | సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న ట్రేడర్లు తమ లైసెన్స్‌లను ఈ ఏడాదికి పునరుద్ధరించుకోవాలని బల్దియా అధికారులు తెలిపారు. గతేడాది డిసెంబర్ 31తో ట్రెడ్ లైసెన్స్ గడువు ముగిసిందని, వీరంతా ఈ నెల 31లోగా తమ లైసెన్స్‌లను రెన్యువల్ చేయించుకోవాలన్నారు. ప్రతి ట్రేడ్ లైసెన్స్ పునరుద్ధరణపై రూ.5వేలు విధించబడుతుందని పేర్కొన్నారు. ట్రేడ్ లైసెన్స్‌ల రెన్యువల్లో జాప్యం చేస్తే లైసెన్స్ ఫీజుకు అదనంగా ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31వ తేదీ మధ్యలో రెన్యువల్ చేస్తే 25 శాతం అపరాధ రుసుం, ఏప్రిల్ 1 తర్వాత లైసెన్స్‌లను పునరుద్ధరిస్తే రెన్యువల్ దరఖాస్తులపై అదనంగా 50 శాతం ఆపరాధ రుసుంగా వసూలు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ట్రేడ్ లైసెన్స్ లేని వారు కూడా ట్రేడ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ట్రేడ్ లైసెన్స్ పొందకుండా వ్యాపారాలు నిర్వహిస్తే 100 శాతం పెనాల్టీ విధించడంతో పాటు నెలకు 10శాతం అదనపు పెనాల్టీని విధిస్తామని పేర్కొన్నారు. కొత్తగా ట్రేడ్ లైసెన్స్‌లను ఆన్లైన్లో, ఈ-సేవా కేంద్రాలు, జీహెచ్ఎంసీ సిటీజన్ సర్వీస్ సెంటర్లు, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం , సర్కిల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్, కొత్త ట్రేడ్ లైసెన్స్‌లను పొందేందుకు కావాల్సిన సమాచారం కోసం జీహెచ్ఎంసీ వెబ్సైట్ WWW.GHMC.GOV.IN ను సంప్రదించాలని కమిషనర్ సూచించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ట్రేడర్లకు సూచించారు.
5 లక్షల మందిపై ఫోకస్
గ్రేటర్లో ట్రేడ్ లైసెన్స్‌లు లేకుండా, ఫీజులు ఎగ్గొడుతున్న వ్యాపారస్తులపై జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్‌కు సిద్ధమైంది. నగరవ్యాప్తంగా లక్షల్లో వ్యాపారాలు కొనసాగుతుంటే ట్రేడ్ లైసెన్స్‌లు మాత్రం పెరగడం లేదు. ఈ నేపథ్యంలోనే లైసెన్స్‌లు లేకుండా వ్యాపారస్తులు, ఫీజులు చెల్లించని వారి పట్ల స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఆదాయం పెంచుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఒక్కో సర్కిల్‌కు 20 ప్రత్యేక బృందాలను నియమించారు. వ్యాపారం చేస్తున్న వారిని గుర్తించి ట్రేడ్ లైసెన్స్ ఉందా? లేదా? చెక్ చేయనున్నారు. లైసెన్స్ లేకపోతే పెనాల్టీతో పాటు ఫీజులు వసూలు చేయనున్నారు. ట్రేడ్ లైసెన్స్‌లు రెన్యువల్ చేసుకోని వారి పట్ల చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు దాదాపు 5 లక్షల మంది వ్యాపారస్తుల ఫోన్ నంబర్లకు సంక్షిప్త సందేశాలను పంపించారు.
రెన్యువల్ చేయించుకోలేదా..?
నెలాఖరులోగా చేసుకోకుంటే : 25%
ఏప్రిల్ 1 తరువాత : 50%
రెన్యువల్ చేసుకోకుంటే : 100%