సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణ నుంచి బల్దియా తప్పుకునే దిశగా ఆలోచన చేస్తున్నది. ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణకు ఏటా భారంగా మారిన రూ. 15 కోట్ల ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నది. దీనికి కారణం లేకపోలేదు..కానీ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారుల నుంచి పోలీస్‌శాఖ వసూలు చేస్తున్న చలాన్లలో కనీసం జీహెచ్ఎంసీకి 25 శాతం వాటాను కేటాయించాలని దాదాపు కొన్నేళ్లుగా బల్దియా సరారుకు వరుసగా ప్రతిపాదనలను పంపుతున్నా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం రావడం లేదు.
ఈ క్రమంలోనే కొత్త ప్రాజెక్టులు, మౌలిక వసతుల కల్పన, ఇతర అభివృద్ధి పనులకు నెలకు బల్దియాకు రూ. 400కోట్ల మేర అవసరం పడుతుండడం, నిర్వహణ ప్రాజెక్టులు భారమవుతున్న నేపథ్యంలోనే ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నది. రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నిర్వహణ సంబంధిత కమిషనరేట్ బాధ్యత వహించేలా కమిషనర్ లేఖ రాయనున్నట్లు తెలిసింది.
మొత్తం 404 సిగ్నల్స్..
జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు ఉండగా, ప్రస్తుతం పోలీస్‌శాఖ సమన్వయంతో జీహెచ్ఎంసీ ఏటీఎస్సీ, పెలికాన్ సిగ్నల్స్ మొత్తం 404 ఏర్పాటు చేశారు. 169 పాత సిగ్నల్స్, 113 కొత్తగా ఏటీఎస్సీ సిస్టం ద్వారా మొత్తం 282 సిగ్నల్స్ ఏర్పాటు చేయగా, పాదచారుల భద్రతకు 78 పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. 404 సిగ్నల్స్‌ను 57 కారిడార్లలో ఏర్పాటు చేయగా, నాన్ కారిడార్‌లోని 44 సిగ్నల్స్‌ను ఆధునీకరించి కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేస్తున్నారు.
అయితే ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణ పేరిట బల్దియా ఏటా రూ. 15 కోట్ల మేర ఖర్చు చేస్తున్నది. ఈ మేరకు నిర్వహణ చేపడుతున్న బీహెచ్ఈఎల్కు కంపెనీకి చెల్లింపులు జరుపుతున్నది. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఎప్పటికప్పుడు కొత్త ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాల్సి వస్తుండడం, కొత్తగా తక్షణం 25 పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాల్సి రావడంతో జీహెచ్ఎంసీ ఆలోచన చేస్తున్నది. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం తీవ్రమైన నేపథ్యంలో ఆదాయం లేని ట్రాఫిక్ సిగ్నల్ నిర్వహణ అవసరమా? అన్న కోణంలో దృష్టి సారించిన జీహెచ్ఎంసీ మున్ముందు ట్రాఫిక్ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది.