మన్సూరాబాద్, ఆగస్టు 14 : బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ నెల 9న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. భూ తగాదాలే హత్యకు కారణమని తేల్చారు. ఎనిమిది నిందితులను అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు రాచకొండ సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు. ఎల్బీనగర్లోని సీపీ క్యాంపు కార్యాలయంలో బుధవారం సీపీ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు. మీర్పేట్, షరీఫ్‌నగర్, వాది ఈ సనత్లో వ్యాపారి షేక్ మహ్మద్ హమీద్ నివసిస్తున్నాడు. అతడి ఇంటి పక్కనే పాతనేరస్తుడు ఖాజా రియాజుద్దీన్ (40) ఉంటున్నాడు.
మేలో వాదిఈ సనత్లోని ఓ స్థలంలో షేక్ మహ్మద్ హమీద్ వాటర్ ప్లాంటును ఏర్పాటు చేశాడు. ఆ స్థలం తనదంటూ ఖాజా రియాజుద్దీన్ మహ్మద్ హమీద్‌తో గొడవపడ్డాడు. వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్న స్థలం తనదంటూ ఖాజా రియాజుద్దీన్ తరచూ గొడవలు పెట్టుకుంటుండంతో అతడిపై మహ్మద్ హమీద్ కక్ష పెంచుకున్నాడు. ఖాజా రియాజుద్దీన్‌ను అంతమొందిస్తేనే..స్థలం దక్కుతుందని భావించిన మహ్మద్ హమీద్ పథకం వేసుకున్నాడు. పాతనేరస్తుడైన మహ్మద్ సలీంను కలిశాడు.
ఖాజా రియాజుద్దీన్‌ను చంపితే 13 లక్షలు ఇస్తానని సలీంతో ఒప్పందం చేసుకొని.. ముందుగా రూ. 2.50లక్షలు అడ్వాన్సుగా ఇచ్చాడు. హత్యలో సహకరిస్తే పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తానని..మహ్మద్ సలీం మహ్మద్ సుల్తాన్, మహ్మద్ గౌస్, మహ్మద్ ఇస్మాయిల్, అహ్మద్ అలియాస్ బాద్షా, సయ్యద్ ఇనాయత్ ఉల్హా, తాఫీక్ఖాన్, షేక్ హుస్సేన్‌కు చెప్పాడు. మహ్మద్ హమీద్, మహ్మద్ సలీం యూపీకి వెళ్లి.. ఫజిల్, ఫరాజ్ అనే వ్యక్తుల వద్ద కంట్రీమేడ్ పిస్టల్, బుల్లెట్లను కొనుగోలు చేశారు.
ఖాజా రియాజుద్దీన్ కంచన్‌బాగ్‌లోని ఓ బార్లో ఈ నెల 9న మద్యం సేవించి రాత్రి ఇంటికి బయలు దేరాడు. సలీం, సుల్తాన్, గౌస్, ఇస్మాయిల్ కారులో బైకుపై వెళ్తున్న ఖాజా రియాజుద్దీన్‌ను వెంబడించి..కారుతో బైకును ఢీకొట్టారు. ఖాజా రియాజుద్దీన్‌పై మహ్మద్ సలీం పిస్టల్‌తో కాల్పులు జరపగా, మిగతా వారు ఆయుధాలతో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఎనిమిది మంది నిందితులను పట్టుకోగా, మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.