హైదరాబాద్, మే 22 : బాలికను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురిచేసి గత రెండు సంవత్సరాలుగా పరారీలో ఉన్న వ్యక్తిని బాలానగర్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఏసీపీ బాలానగర్ పి.నరేశ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్‌నగర్ నివాసి రాబిన్సన్ డి కార్నెల్ (25) ఏప్రిల్ 2023లో బాలానగర్‌లో నివసిస్తున్నప్పుడు 17 సంవత్సరాల వయస్సు గల బాలికను కలిశాడు. ఇరువురు స్నేహితులుగా మారారు.
మరుసటి నెలలో, అతను ఆ అమ్మాయిని తనతో ఇంట్లోంచి వచ్చేయాలని ప్రలోభపెట్టాడు. అతడి ఒత్తిడి మేరకు, ఆ అమ్మాయి తన ఇంటి నుండి బయటకు వచ్చింది. రాబిన్సన్ ఆమెను విశాఖపట్నం తీసుకెళ్లి అక్కడ తన బంధువు ఇంట్లో నిర్బంధించాడు. రెండు రోజులు ఇంట్లోనే బంధించి, రెండుసార్లు లైంగిక వేధింపులకు గురిచేశాడు. తర్వాత ఆమెను తిరిగి హైదరాబాద్‌కు తీసుకువచ్చి సికింద్రాబాద్‌లో వదిలి పారిపోయాడు. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రెండేళ్లుగా పరారీలో ఉన్న రాబిన్సన్ను చివరకు గురువారం పట్టుకుని అరెస్టు చేశారు.