సిటీబ్యూరో, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): బాలానగర్ ఘటనలో వాహనదారుడు జోష్‌బాబు మృతికి కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్ గోపాల్ మద్యం మత్తులో లేడని బాలానగర్ డీసీపీ సురేశ్‌కుమార్ వెల్లడించారు. ఈనెల 13న మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో బాలానగర్ ఐడీపీఎల్ కాలనీ గేటు వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించిన ఘటనలో ద్విచక్రవాహనదారుడు జోష్‌బాబు ఆర్టీసీ బస్సు కింద పడి దుర్మర ణం చెందిన విషయం తెలిసిందే.
అయితే వాహనదారుడి మృతికి సదరు కానిస్టేబులే కారణమని, అతను వాహనదారుడిని పక్కకు లాగడం వల్లే జోష్‌బాబు అదుపుతప్పి కింద పడడంతో అతడిపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లి, దుర్మరణం చెందినట్లు వస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని డీసీపీ పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించారు. విధి నిర్వహణలో భాగంగా కానిస్టేబుల్ వాహనదారుడిని ఆపేందుకు యత్నించగా అతడు తప్పించుకుని వెళ్లే క్రమంలో రైట్ టర్న్ తీసుకుని వెళ్తుండగా అటుగా వచ్చిన మరో ద్విచక్రవాహనానికి తగిలి, ప్రమాదవశాత్తు కిందపడిపోయాడని, అదే సమయంలో అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సు జోష్బాబుపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందినట్లు డీసీపీ వివరించారు.
అంతే కాకుండా కానిస్టేబుల్ గోపాల్ మద్యం మత్తులో ఉన్నట్లు మృతుడి కుటుంబ సభ్యులతో పా టు స్థానికులు ఆరోపించిన నేపథ్యంలో అతడికి బ్రీత్ అనలైజర్ పరీక్షతో పాటు రక్త పరీక్షలు సైతం నిర్వహించామని,ఈ పరీక్షల్లో కానిస్టేబుల్ రక్తం లో అల్కహాల్ కనిపించలేదని తెలిపారు. ఈ విషయం లో క్రైమ్ నం.191/2025, బీఎన్ఎస్ సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేసి, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు. కేసు విచారణ తరువాత బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని డీసీపీ సురేశ్‌కుమార్ తెలిపారు.