Infant Kidnapped | సుల్తాన్‌బజార్, నవంబర్ 24: నీలోఫర్ దవాఖానలో నెల రోజుల పసికందు కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఘటన జరిగిన 24 గంటల్లోపు నిందితులను గుర్తించి నెల రోజుల పసికందును తల్లి చెంతకు చేర్చారు. ఆదివారం నాంపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైఫాబాద్ ఏసీపీ సంజయ్‌కుమార్, ఇన్స్పెక్టర్ అప్పలనాయుడుతో కలిసి వివరాలను వెల్లడించారు. గత నెల 25న జహీరాబాద్ ఏరియా దవాఖానలో హసీనాబేగం మగబిడ్డను జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డకు కామెర్లు ఉండటంతో వైద్య చికిత్స నిమిత్తం గత నెల 29న నిలోఫర్ దవాఖానలో చేర్పించారు. వైద్య చికిత్స అనంతరం ఈ నెల 23న వైద్యులు పసి కందును డిశ్చార్జి చేశారు.
అదే సమయంలో ఏపీ, అనంతపురానికి చెందిన షాహీన్ బేగం, అబ్దుల్లా అలియాస్ వెంకటేశ్, రేష్మా అలియాస్ రేణుకలు మగబిడ్డను అపహరించాలని పథకం పన్ని నిలోఫర్‌కు వచ్చారు. వెంకటేశ్ దవాఖాన బయట ఉండగా, షాహీన్ బేగం నల్ల బుర్ఖా ధరించి డిశ్చార్జి కాగితాలపై సంతకాలు చేస్తున్న హసీనాబేగంను దారి మళ్లించి ఆమె వద్ద ఉన్న నెల రోజుల పసికందును అపహరించి ఆటోలో తీసుకెళ్లారు. బాలుడి తల్లి హసీనాబేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీసులు తక్షణమే 5 బృందాలను రంగంలోకి దింపారు. మాసబ్‌ట్యాంక్ వరకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి.. ఎన్‌హెచ్ 44 హైవేపై కర్నూలుకు వెళ్తున్నట్లు గుర్తించి.. డీసీపీ అక్షంక్ష్ యాదవ్ గద్వాల ఎస్పీకి సమాచారం అందించారు.
అతను గద్వాల పీఎస్, కర్నూలు హైవేపై ఉన్న మనపాడు, ఉండవల్లి స్థానిక పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. ఉండవల్లి ఎస్ఐ చంద్రకాంత్ పుల్లూరు టోల్ ప్లాజా వద్ద మారుతీ ఓమ్నీ (ఏపీ 28 ఏవీ 0785)ను ఆపి తనిఖీ చేయగా నిందితులతో పాటు మగ శిశువు ఉన్నట్టు గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే నాంపల్లి పోలీసులు ఉండవల్లి పీఎస్‌కు వెళ్లి మగ శిశువును తీసుకువచ్చి తల్లి హసీనా బేగంకు ఆదివారం ఏసీపీ సంజయ్ కుమార్ చేతుల మీదుగా అప్పగించారు. కేసును ఛేదించిన నాంపల్లి ఇన్స్పెక్టర్ అప్పలనాయుడును, బృందాన్ని డీసీపీ ,ఏసీపీ లు అభినందించారు.