సిటీబ్యూరో, ఆగస్ట్ 1 (నమస్తే తెలంగాణ): దేశ, విదేశాల్లో ఎగుమతి, దిగుమతులకు సంబంధించిన వ్యాపార అవకాశాలు ఇప్పిస్తామంటూ బిజినెస్ టు బిజినెస్ (బీటూబీ) డీల్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఢిల్లీకి చెందిన ముఠాలో సభ్యుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారిని బోల్తా కొట్టించి రూ.1.11 కోట్లు కొట్టేసినట్లు క్రైమ్స్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. శుక్రవారం బషీర్‌బాగ్‌లోని సీసీఎస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సైబర్‌క్రైమ్ డీసీపీ కవితతో కలిసి విశ్వప్రసాద్ నిందితుడి అరెస్ట్ వివరాలు వెల్లడించారు.
హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారిని ఢిల్లీకి చెందిన లక్ష్యవర్మ అనే వ్యక్తి ఫండమెంటల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధిని అంటూ పరిచయం చేసుకున్నారు. తాము బిజినెస్ టు బిజినెస్‌లో భాగంగా దేశ, విదేశాలలో ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్కు సంబంధించిన బిజినెస్ కాంట్రాక్ట్‌లు ఇస్తామని చెప్పారు. తమ ప్రాజెక్ట్‌లతో భారీ లాభాలు పొందవచ్చని ఆశపుట్టించి, హాంగ్‌కాంగ్‌కు చెందిన ఏసీస్ ట్రేడింగ్ కంపెనీ ద్వారా స్పిరులినా పౌడర్‌ను ఎగుమతి, దిగుమతి చేసుకోవచ్చని చెప్పారు.
ఇందులో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించారు. దీనికోసం కొన్ని చార్జీలు కట్టాల్సి ఉంటుందని, ఆర్డర్ వచ్చిన తర్వాత మీ చార్జెస్ మీకే ఇస్తామంటూ మాయ చేశారు. వారిమాటలను నమ్మిన వ్యాపారి రూ.1,11,33,501 చెల్లించారు. ఆ తర్వాత ఏసీస్ కంపెనీ గురించి ఆరా తీయగా అది బోగస్ అని తేలడంతోపాటు లక్ష్యవర్మను సంప్రదించాలని ప్రయత్నించగా అతను స్పందించలేదు. దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దర్యాప్తు చేసిన పోలీసులు ఈ నేరానికి పాల్పడింది లక్ష్యవర్మతో పాటు పారస్సింగ్లా, మహేశ్సింగ్లాగా గుర్తించారని అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. ఈ ముఠాలో సభ్యుడైన పారస్సింగ్లాను అరెస్ట్ చేశామని, అతని నుంచి 30 మొబైల్ఫోన్లు, 3 సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దని, వారు ఇచ్చే ఆఫర్లను వ్యక్తిగతంగా వెళ్లి పరిశీలించుకున్న తర్వాతే బిజినెస్ ఇన్వెస్ట్మెంట్లు చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో సైబర్‌క్రైమ్స్ ఏసీపీ శివమారుతితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
జూలై నెలలో జరిగిన సైబర్ క్రైమ్ ఆపరేషన్స్‌లో రాష్ట్రంతో పాటు ఇతర రాష్ర్టాలకు సంబందించిన 48 మంది నిందితులను డిజిటల్ అరెస్ట్, ట్రేడింగ్ ఫ్రాడ్, ఇన్వెస్ట్మెంట్ తో సహా పలు రకాల మోసాలకు సంబంధించిన కేసుల్లో అరెస్ట్ చేశామని హైదరాబాద్ క్రైమ్స్ విభాగం అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. జూలైలో సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లకు 301 ఎన్సీఆర్పీ ఫిర్యాదులు వచ్చాయని, వీటిలో 179 కేసులు రిజిస్టర్‌కాగా జెడ్సీసీ సహకారంతో వివిధ పోలీస్స్టేషన్లలో 90 ఎఫ్ఐఆర్లు నమోదు అయినట్లు ఆయన తెలిపారు. వివిధ కేసులకు సంబంధించి 32 మందికి రూ.2,21,70,130 లు రిఫండ్ చేసినట్లు విశ్వప్రసాద్ పేర్కొన్నారు. అరస్టైన నిందితుల్లో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రం నుంచి 78 మంది ఉన్నారు.