అయోధ్య, ఆగస్టు 19: అయోధ్య విరాళాల అక్రమాలపై విచారణ జరుపుతున్న సిట్.. మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని మాజీ ఉద్యోగి మహిపాల్ సింగ్ ప్రశ్నించారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాజీ అకౌంట్స్ ఇన్చార్జి, అయోధ్య విరాళాల వివాదంపై విజిల్ బ్లోయర్‌గా వ్యవహరిస్తున్న ఆయన దానికి సంబంధించిన పలు అంశాలను మీడియాతో పంచుకున్నారు. 10 నెలల పాటు అయోధ్యకు విరాళాలుగా వచ్చిన వస్తువులు, నగదుకు ట్రస్ట్ ఎలాంటి రసీదులు ఇవ్వలేదని వెల్లడించారు. బ్యాంక్ అధికారిగా పనిచేసి రిటైరైన తనను 2021లో ట్రస్ట్ పిలిపించిందని, 10 నెలల పాటు విరాళాలకు రసీదులు జారీ చేయలేదని, ఆ సమస్యను పరిష్కరించాలని కోరుతూ అకౌంట్స్ ఇన్చార్జిగా తనను నియమించిందని తెలిపారు.
2021 జనవరి నుంచి 2022 జూలై వరకు తాను అక్కడే విధులు నిర్వహించానన్నారు. అయితే 2022 మార్చిలోనే అకౌంట్స్ విభాగం నుంచి తనను తొలగించారని తెలిపారు. చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రాకు పాత సిట్ క్లీన్ చిట్ ఇవ్వని విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ.. సెప్టెంబర్ 2న జరిగే సమావేశం కోసం వారు వెనక్కి వచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆరోపించారు. అకౌంట్ల నిర్వహణకు సంబంధించి పలు అభ్యంతరాలు తెలిపినా ట్రస్ట్ ఏదీ పరిష్కరించ లేదన్నారు. విరాళాల లెక్కింపు బాధ్యతను వారణాసికి చెందిన సంస్థకు అప్పగించినా, లెక్కింపు సిబ్బంది నియామకం రాయ్, టిన్ను యాదవ్ కనుసన్నల్లోనే జరిగాయని, మనీశ్ యాదవ్‌ను అలాగే నియమించారని తెలిపారు.