Community Radio | సిటీబ్యూరో, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): పెరుగుతున్న సైబర్‌నేరాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, ట్రాఫిక్ అలర్ట్స్‌ను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు హైదరాబాద్ పోలీసులు కమ్యూనిటీ రేడియోను ప్రారంభించనున్నారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్సీఎస్సీ)తో కలిసి ప్రారంభించే ఈ రేడియో.. ఎఫ్ఎం రేడియో తరహాలోనే పనిచేస్తుంది. ఇప్పటికే కర్ణాటక, గుజరాత్‌లోని జైళ్ల శాఖతో పాటు జమ్మూ కశ్మీర్లో ఆర్మీ అధికారులు ప్రత్యేకంగా రేడియోలను నిర్వహిస్తున్నారు.
మీడియా రంగంలో ఎఫ్ఎం రేడియో నేడు తనదైన స్థానాన్ని కలిగి ఉంది. ఇక సిటీ పోలీసులు కూడా గుడ్ మార్నింగ్ హైదరాబాద్.. అంటూ ప్రజల్లోకి రేడియో ద్వారా వెళ్లనున్నారు. ఇప్పటి వరకు ఎఫ్ఎం రేడియోలలో ట్రాఫిక్ అలర్ట్స్‌ను ప్రకటిస్తున్నారు. తామే ఒక రేడియోను నిర్వహించడంతో ప్రస్తుతం పెరుగుతున్న సైబర్నేరాలను అడ్డుకోవచ్చనే ప్రధానమైన లక్ష్యంతో పోలీసులు ఈ రేడియోను ప్రారంభించేందకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రేడియో ద్వారా భోనాలు, వినాయక నవరాత్రి ఉత్సవాలు, ఇతర ప్రధానమైన ర్యాలీలు, సభలతో పాటు సున్నితమైన అంశాలలోనూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయనున్నారు.
దీనికి తోడు ట్రాఫిక్ సమస్యలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు వాహనదారులకు చేరవేయనున్నారు. ప్రస్తుతం సైతం ఎఫ్ఎం రేడియో ద్వారా అలర్ట్స్ ప్రకటనలిస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. సొంత రేడియో ఉండటం వల్ల మరింత వేగంగా ప్రజలకు సమాచారం ఇవ్వవచ్చని భావిస్తున్నారు. అయితే, సాధారణ ఎఫ్ఎం రేడియో మాదిరిగానే పోలీసులు కూడా ఈ రేడియోను నిర్వహిస్తారు. వినోద కార్యక్రమాలు, సంగీతం, ఇతర కార్యక్రమాలన్నీ ఉంటాయి.
ప్రకటనల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసే విషయాలను ప్రకటిస్తుంటారు. ఇటీవల హెచ్సీఎస్సీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ఈ రేడియోను త్వరలో ప్రారంభించే విషయాన్ని వెల్లడించారు. నగర పోలీసుల ఆధ్వర్యంలో అందుబాటులోకి వస్తున్న ఈ రేడియో ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉండాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఏదో రేడియో తెచ్చాం.. మన పని అయిపోయిందని కాకుండా.. ఆ రేడియో ద్వారా సైబర్‌క్రైమ్ వంటి నేరాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరముంటుందని అధికారులు చర్చించుకుంటున్నారు. అత్యాశకు పోయి చాలా మంది సైబర్‌నేరగాళ్ల చేతికి చిక్కి.. ఆర్థికంగా నష్టపోతున్నారు. ఎఫ్ఎం రేడియో ద్వారా ఇలాంటి వారిని అప్రమత్తం చేసే అవకాశం కూడా ఉంటుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు.