అర్ధరాత్రి రేసింగ్‌లు పెట్టుకున్న ఆటోవాలాలు
అరెస్టు చేసిన చాంద్రాయణగుట్ట పోలీసులు
సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ)/చాంద్రాయణగుట్ట: సిటీ రోడ్లపై బైక్ స్టంట్లు చేసేవారు కనిపించేవారు. ఇప్పుడు కొందరు ఆటోవాలాలూ మొదలుపెట్టారు. రేసింగ్‌లు పెట్టుకుంటూ.. హల్చల్ చేస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన పెట్రోలింగ్ పోలీసులు గట్టి నిఘా పెట్టి.. ఆటో విన్యాసాలకు చెక్ పెట్టారు.
అర్ధరాత్రి దాటిన తర్వాత
గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత సంతోష్‌నగర్, ఓవైసీ జంక్షన్, చాంద్రాయణగుట్ట రహదారిపై ఆటో రేసింగ్‌లు జరిగాయి. ఆటోలతో యువకులు విన్యాసాలు చేస్తూ..నడిరోడ్డుపై ప్రమాదభరితంగా స్టంట్లు చేశారు. ఇతర వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగించారు. కొందరు వాహనదారులు ఆటోల స్టంట్లను వీడియోలు తీసి.. సోషల్‌మీడియాలో సర్క్యూలేట్ చేశారు. దీంతో రోడ్లపై విన్యాసాలు చేసిన టోలీచౌకి చెందిన సయ్యద్ జుబేర్ అలీ (20), సయ్యద్ షాహీల్ (21), మహ్మద్ ఇనాయత్ (23), మహ్మద్ సమీర్ (19), అమీర్‌ఖాన్ (20), గోల్కొండ వాసి గులాం సైఫుద్దీన్ (23)లను అరెస్టు చేసిన చాంద్రాయణగుట్ట పోలీసులు మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఆటో డ్రైవర్ మహ్మద్ ఇబ్రహీం (21) పరారీలో ఉన్నాడు. నిందితులపై వాహన చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సీసీ ఫుటేజీలు పరిశీలన
ఈ ఘటన వెలుగులోకి రావడంతో సిటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. రహదారులపై నిఘాను పటిష్టం చేశారు. గతంలో ఇలాంటి స్టంట్లు ఎవరైనా చేశారా? అనే విషయమై సీసీ ఫుటేజీలను పరిశీలించి.. వాహనాల నంబర్లను గుర్తించి..చర్యలు తీసుకునేందుకు సిద్ధవుతున్నారు.