సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ) : ఆటో డ్రైవర్ల దీనస్థితులపై ఆదివారం గ్రేటర్ హైదరాబాద్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో ఉదయం 10:30 గంటలకు సమావేశం జరగనున్నది. ఈ మేరకు తెలంగాణ ఆటో మోటర్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
పోలీసుల వేధింపులు, ఫైనాన్స్ బెదిరింపులు, ఉపాధి లేకుండా చేసిన కాంగ్రెస్ మోసాలపై ముఖ్య నాయకులతో చర్చించి సమస్యల పరిష్కారానికి పోరాటాన్ని ఉధృతం చేసే కార్యాచరణ సిద్ధం చేయబోతున్నట్టు చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి జల్లాల ముఖ్య నాయకులు ఇందులో పాల్గొంటారని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలతో ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ ఇప్పటికే అనేక హామీలు ఇచ్చారని, ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆయన విమర్శించారు.