హిమాయత్‌నగర్, జూలై 25 : నగరంలో కొత్త ఆటోల పర్మిట్ల జారీలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 14న ఒక రోజు ఆటో బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్ తెలిపారు. శుక్రవారం హైదర్‌గూడలోని ఎన్ ఎస్ ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొందరు డీలర్లు, ఆటో ఫైనాన్షియర్లు కుమ్మక్కై కొత్త ఆటోలను అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు.
కొత్త ఆటో పర్మిట్లను మంజూరు చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందే తప్ప ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. ఇతర జిల్లాల ఆటోలను నగరంలోకి అనుమతించవద్దని, ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి రూ.12000 ఇవ్వాలన్నారు. ఆగస్టు 14న జరిగే ఒక రోజు ఆటో బంద్‌లో ఆటో డ్రైవర్లు అధిక సంఖ్యల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో ఆటో జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజాహిద్ హష్మి,నేతలు సలీం,యాహియా,మహ్మద్ లతీఫ్, లక్ష్మీ నరసయ్య, రజాక్ పాల్గొన్నారు.