ఆర్టీఏ కార్యాలయాల్లోకి ఆటోలకు అనుమతి లేదు. ఆటో లైసెన్స్ కావాలని ఆర్టీఏ కార్యాలయానికి వెళితే కారు నేర్చుకొని రావాలంటూ అధికారులు తిప్పి పంపిస్తున్నారు. ఆటో లైసెన్స్ కావాలంటే కారు నడపాలని బదులిస్తున్నారు. కొత్తగా వచ్చిన సారథి సేవల్లో త్రీ వీలర్ ఆటో లైసెన్స్ సేవలు తొలిగించినట్టు చెబుతున్నారు. సారథి పోర్టల్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా పరిశీలించి పూర్తి స్థాయి సేవలు ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ పోర్టల్‌తో లైసెన్స్ ప్రక్రియ జఠిలంగా మారింది. లైసెన్స్ దరఖాస్తు చేసుకోవడం, రెన్యూవల్ వంటి ప్రక్రియలు వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. సారథి సేవల్లో త్రీ వీలర్ ఆటో లైసెన్స్ జారీ లేదు. ఆటో నడపడానికి టెస్ట్ డ్రైవ్‌లో అధికారులు అనుమతించడం లేదు. ఆటోకు బదులు కారు నడపాలంటూ ఆర్టీఏ అధికారులు హుకూం జారీ చేస్తున్నారు. చేసేదేం లేక చాలా మంది ఆటో డ్రైవర్లు వెనుతిరిగి వస్తున్నారు. కారు డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం డ్రైవింగ్ స్కూల్స్ వెంట పరుగులు తీస్తున్నారు. తీరా కారు నేర్చుకుంటే వచ్చే లైసెన్స్ ఎల్ఎంవీ. అయితే ఈ లైసెన్స్ ఆటో నడపడానికి చెల్లుబాటు అవుతుందని ఆర్టీఏ అధికారులు చెబుతున్నా.. టెక్నికల్‌గా అనేక సమస్యలు వస్తున్నాయని ఆటో డ్రైవర్లు లబోదిబోమంటున్నారు.
– సిటీబ్యూరో
ప్రమాదం జరిగితే..!
ఆటో నడపాలంటే దానికి సంబంధించిన శిక్షణ ఉంటుంది. అందుకు అనుగుణంగా సారథి ప్రారంభానికి ముందు త్రీ వీలర్ లైసెన్స్ జారీ చేసేవాళ్లు. డ్రైవింగ్ లైసెన్స్‌లో త్రీ వీలర్ ఆటో లైసెన్స్ అని ప్రత్యేకంగా ఉండేది. కానీ సారథితో జారీ అవుతున్న లైసెన్స్‌ల్లో ఆటో లైసెన్స్ పూర్తిగా తొలిగించారు. దీంతో కారు నడపడం ఆటో డ్రైవర్లకు అనివార్యంగా మారింది. అయితే కారు నడిపితే వచ్చే లైసెన్స్ ఎల్ఎంవీ లైసెన్స్. ఈ లైసెన్స్‌తో ఆటో నడిపితే ఏదైన ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ సంస్థలు ‘మీకు త్రీవీలర్ ఆటో లైసెన్స్ లేదు.’ అని చేతులెత్తేస్తే నష్టపోయేది తామేనంటూ ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఆటో కొనుగోలు చేయాలంటే కూడా త్రీ వీలర్ లైసెన్స్ చూపించాలని షోరూంలు నిబంధనలు పెడుతున్నాయి. ఓల, ఉబర్, ర్యాపిడో వంటి సంస్థలు కూడా త్రీ వీలర్ లైసెన్స్‌ను అడుగుతున్నారని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం స్పందించాలి
సారథి పోర్టల్ సేవలను మరింత సులభతరం చేయాలి. కానీ గతంలో ఉన్న సులభతరమైన సేవలను నిలిపివేసి డ్రైవర్లను కష్టపెడుతున్నారు. ఆటో డ్రైవర్‌కు కారు నడపడం రాకపోతే లైసెన్స్ ఇవ్వమని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. సారథి పోర్టల్ అలానే ఉందని అంటున్నారు. ఇది అన్యాయం. ఆటో డ్రైవర్లు నష్టపోతారు. కారు నడపడం రాకపోతే ఆటో లైసెన్స్ ఇవ్వడం లేదు. అలా అయితే ఆటో నడపడం ఎలా? బతకడం ఎలా? ప్రభుత్వం ఈ సమస్యపై స్పందించి పరిష్కరించాలి.
– సత్తి రెడ్డి, ఆటో
యూనియన్ నాయకులు అధికారులు పట్టించుకోవడం లేదు
సారథిలో స్లాట్ బుక్ చేసుకోవడానికి నరకం చూడాల్సి వస్తున్నది. నాలుగు ఓటీపీలు, ఐదు క్యాప్చాలు ఎంటర్ చేయాలి. ఇందులో ఒక్కటి సరిగా చేయకపోయినా మళ్లీ ప్రాసెస్ మొదట్నుంచి చేయాల్సి ఉంటుంది. అతి కష్టం మీద స్లాట్ బుక్ చేసుకొని కార్యాలయానికి వెళితే అక్కడ మళ్లీ ఓటీపీలు ఎంటర్ చేయాల్సి వస్తున్నది. అందులో ఏదైనా సమస్య వస్తే మరుసటి రోజు రావాలంటూ చెబుతున్నారు. ఇంత కష్టం మిగిల్చే సారథి పోర్టల్‌ను అదికారుల ఎందుకు అప్డేట్ చేయలేకపోతున్నారు. ఆటో డ్రైవింగ్‌లో ఏండ్ల అనుభవం ఉంది. కొత్తగా ఎల్ఎంవీ లైసెన్స్ ఇస్తే ఆ అనుభవం అంతా పోయినట్టే కదా. అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
– యాదగిరి ఆటో డ్రైవర్