సిటీబ్యూరో, డిసెంబర్ 2(నమస్తే తెలంగాణ)/ హిమాయత్‌నగర్: డిసెంబర్ 7న రాష్ట్ర వ్యాప్తంగా ఆటో, టాక్సీ, వ్యాన్, క్యాబ్‌ల బంద్ నిర్వహిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఆటో, టాక్సీ, వ్యాన్, క్యాబ్ డ్రైవర్ల సంఘాల జేఏసీ నాయకులు వెంకటేశం, వేముల మారయ్య, సత్తిరెడ్డి తెలిపారు. బంద్‌కు అన్నీ పార్టీల మద్దతును కోరుతూ సంబంధిత పార్టీ నాయకులను కలిసి ఆటో డ్రైవర్ల సమస్యలన్నింటిని వివరిస్తున్నామని చెప్పారు. అన్ని పార్టీల మద్దతు కోరడంలో భాగంగా సోమవారం సీపీఐ ఎమ్మెల్యే సాంబ శివరావును కలిసి డ్రైవర్ల సమస్యలు వివరించామన్నారు.
డిసెంబర్ 7న సుందరయ్య పార్కు నుంచి ఇందిరా పార్కు వరకు ర్యాలీ ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం, బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు, అన్ని పార్టీలను సభకు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు మొదలయ్యాయని చెప్పారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామన్న హామీ కూడా ఇప్పటికీ ఇవ్వలేదని మారయ్య వాపోయారు. తమ న్యాయమైన డిమాండ్లపై నిరసన వ్యక్తం చేస్తే రాజకీయ కోణంలో ప్రభుత్వం చూస్తుందని చెప్పారు.
ఎలాంటి రాజకీయ కోణంలో తమ నిరసనను ప్రభుత్వం చూడొద్దని సూచించారు. మహా లక్ష్మి పథకం వలన నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని కోరారు. ఏడాదికి డ్రైవర్లకు రూ.15 వేలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఓలా, ఊబర్, ర్యాపిడో అక్రమంగా నడుస్తున్న వాహనాలపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆటోలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలన్నారు.
యాక్సిడెంట్ బీమాను రూ.10 లక్షలకు పెంచి సాధారణ మరణాలకు సైతం వర్తింపజేయాలని కోరారు. 50 ఏండ్లు నిండిన ఆటో డ్రైవర్లకు వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2019 మోటారు వాహనాల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఫైనాన్షియర్ల దోపిడీని అరికట్టాలన్నారు. రాష్ట్రంలో ఆటోలు, క్యాబ్‌లకు పార్కింగ్ స్థలాలు ఇవ్వాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను సాధించుకోవడంలో భాగంగా డ్రైవర్లు అందరూ అధిక సంఖ్యలో తరలిరావాలని జేఏసీ పిలుపునిచ్చింది.