సిటీబ్యూరో: ఆటోల కొనుగోలులో సాంకేతిక సమస్యలు ఎదురవుతుండటంతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ప్రభుత్వం 65వేల ఆటో పర్మిట్లను విడుదల చేసింది. వీటిలో 20 వేల ఎలక్ట్రిక్ ఆటోలు, 10 వేల ఎల్పీజీ ఆటోలు, మరో 10వేల సీఎన్జీ ఆటో పర్మిట్లు ఉన్నాయి. ఇవే కాకుండా మరో 25 వేల ఎల్పీజీ, డీజిల్, పెట్రోల్ ఆటోలను రిట్రో ఫిట్మెంట్లు అమర్చుకొని ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. కొత్తగా ఆటోలు కొనుగోలు చేయాలనుకున్న వారు షోరూం డీలర్ల వద్ద తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
అయితే అర్హత గల చాలా మంది తమ దరఖాస్తులను దగ్గర్లోని షోరూంల్లో సమర్పించినప్పటికీ సాంకేతిక సమస్యలతో తిరస్కరణకు గురవుతున్నాయి. నగరంలో ఒక్కో షోరూం వద్ద వందలాది దరఖాస్తులు పేరుకుపోతున్నాయి. వాటిని ఆర్టీఏ అధికారులు పరిశీలించి అన్ని అర్హతలు ఉన్నవారిని ఎంపిక చేసి షోరూం డీలర్లకు పంపించాల్సి ఉంటుంది. అనంతరం షోరూం వాళ్లు వారికి ఆటోలను విక్రయిస్తారు. కానీ ఈ ప్రక్రియ చేపట్టడంలో ఆర్టీఏకు సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. ఐటీ విభాగం సాంకేతిక ఇబ్బందులను పరిష్కరించలేకపోతున్నది.