మేడ్చల్, డిసెంబర్26(నమస్తే తెలంగాణ): దేవాలయ భూములకు జియో ట్యాగింగ్‌లో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ సర్కారు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో దేవాలయ ప్రభుత్వ భూములను గుర్తించి కబ్జాలకు గురికాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నది. దేవాదాయ భూముల వివరాలను వెబ్సైట్లో నమోదు చేసి.. వాటిని జీపీఎస్‌కు అనుసంధించాలని నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జియో ట్యాగింగ్‌పై దృష్టి సారించకపోవడంతో ప్రక్రియ ముందుకు సాగడం లేదు. రెవెన్యూ, దేవాదాయ, సర్వే అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం మూలంగానే జియో ట్యాగింగ్ ప్రక్రియ జరగడం లేదని తెలుస్తున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 3,960 ఎకరాల దేవాదాయశాఖకు చెందిన భూములు ఉన్నట్లు రికార్డుల్లో ఉంది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా గుర్తించిన దేవాదాయశాఖకు చెందిన భూములకు జియో ట్యాగింగ్ చేస్తే కబ్జాలను నివారించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అనేకం కబ్జాలకు గురైన నేపథ్యంలో మిగతా భూములు ఆక్రమణలకు గురికాకుండా ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. దేవాదాయ భూములకు ఫిన్సింగ్లను ఏర్పాటు చేసే విధంగా చూడాలని ప్రజల నుంచి అధికారులకు అనేక ఫిర్యాదులు వస్తున్నా.. జియో ట్యాగింగ్ చేసేందుకు అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నరన్న విమర్శలొస్తున్నాయి.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దేవరయాంజల్లో దేవాదాయశాఖ భూములు ఇప్పటికే కబ్జాల్లో ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీనియర్ ఐఏఎస్ అధికారి రఘునందన్‌రావు నేతృత్యంలో 2021 సంవత్సరం మేలో త్రీ సభ్య కమిటీని నియమించారు. ఈ కమిటీ దేవరయాంజల్లో పర్యటించి అప్పటికే దేవరయాంజల్ని దేవాదాఖశాఖ భూముల్లో నిర్మించిన గోదాంలు, వాణిజ్య నిర్మాణాలు, ఫంక్షన్‌హాళ్లు, రిసార్టులు ఉన్న సర్వే నంబర్లని దేవాదాయశాఖకు చెందిన భూములగానే త్రీసభ్య కమిటీ నిర్ధారించింది. దేవరయాంజల్లో 1,350 ఎకరాలు దేవాదాయశాఖకు చెందినవేనని నివేదిక ఇచ్చింది. కమిటీ నివేదిక ప్రకారం.. 1,350 ఎకరాల దేవాదాయశాఖ భూమి అని తేలింది. అయితే కబ్జాల్లో ఉండి నిర్మాణాలు చేసుకున్న వారు ఎలాంటి ఆస్తిపన్నులు చెల్లించకపోగా వారు నిర్మించుకున్న వాటిలో కోట్లలో అద్దెలు వసూళ్లు చేస్తుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. దేవాదాయ భూముల్లో నిర్మించిన వాటిని తొలగించి దేవాదాయ భూములను స్వాధీనం చేసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ భూములకు త్వరగా జియో ట్యాగింగ్ చేసి దేవాదాయ భూములను రక్షించాలని కోరుతున్నారు.