దుండిగల్, ఆగష్టు 26: కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరడం అభినందనీయమని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శాసన సభ్యులు కేపీ వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి గాజుల రామారం (సర్కిల్) డివిజన్లోని ఓక్షిత్ ఎన్క్లేవ్ ఫేజ్-1, 2, వీనస్ ఎన్క్లేవ్, శ్రీవృద్ధి ఎన్క్లేవ్లకు చెందిన సుమారు 500 మంది కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే వివేకానంద్ సమక్షంలో శనివారం రాత్రి బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పార్టీలో నూతనంగా చేరిన కార్యకర్తలకు కండువాలు కప్పిన ఎమ్మెల్యే వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం, ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అధినాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం యావత్ భారత దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. ఇక్కడ అమలవుతున్న పథకాలను ఇతర రాష్ర్టాల్లోనూ అమలు చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారన్నారు. అతి తక్కువ కాలంలోనే అన్ని రంగాలల్లో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ వినుతికెక్కినదన్నారు. పార్టీలో నూతనంగా చేరిన కార్యకర్తలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఆయా కాలనీల ప్రజలు బీఆర్ఎస్కే ఓటు వేసేలా తీర్మానాలు చేయించాలన్నారు. దామోదర్ యాదవ్, గోపాల్‌రెడ్డి, నురపు రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానికులు, బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.