Chintal | సైదాబాద్, మార్చి 8 : టెలికాం డిపార్ట్మెంట్కు సంబంధించిన ఖాళీ స్థలాన్ని కబ్జా చేయటానికి కొందరు ప్రయత్నాలను మొదలు పెట్టారు. ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని నీలం రాజశేఖర్ రెడ్డి నగర్ (చింతల్)లో టెలికాం డిపార్ట్మెంట్కు సంబంధించిన ఖాళీ స్థలంలో కబ్జా ఆక్రమణలకు తెరలేపారు. చింతల్లోని కేంద్ర ప్రభుత్వ టెలికాం డిపార్ట్మెంట్కు చెందిన ఎనిమిదిన్నర ఎకరాల భూమిలో వివిధ జిల్లాల నుంచి వలస వచ్చిన కూలీలు గుడిసెవాసులు 40 ఏండ్ల క్రితం గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు.
గుడిసెలను ఖాళీ చేయాలని టెలికాం డిపార్ట్మెంట్ అధికారులు గుడిసెవాసులకు నోటిసులు ఇవ్వటంతో, అప్పట్నుంచి ఈ స్థల వివాదం న్యాయస్థానంలో కొనసాగుతుంది. మిగతా ఖాళీ స్థలంపై కన్నేసిన కబ్జాదారులు కొంతమేరకు భారీ వాహనాల ద్వారా మట్టిని తీసుకొచ్చి మట్టి పోసి చదును చేసి కబ్జాకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వరస సెలువులు రావటంతో టెలిఫోన్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ శాఖ అధికారుల దృష్టిలో పడకుండా గుట్టుచప్పుడు కాకుండా భూ కబ్జా ఆక్రమణ పనుల్లో నిమగ్నమయ్యారు.
భారీ వాహనాల ద్వారా మట్టిని తీసుకొని అక్రమణలకు పాల్పడుతుండటాన్ని గమనించిన స్థానికులు శుక్రవారం సైదాబాద్ రెవెన్యూ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వారు ఆక్రమణ ప్రయత్నాలను అడ్డుకొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్థలం కబ్జాకు కాకుండా తగు చర్యలు తీసుకోవాలని, మట్టి పోసి చదును చేస్తున్న వారిని గుర్తించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని, ఈ స్థలాన్ని ప్రభుత్వ అవసరాలకు కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు.