దుండిగల్, జనవరి 20: నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో రూ.8.69 కోట్ల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం వివాదాస్పదంగా మారింది. ‘నాకు సరైన సమాచారం ఇవ్వకుండా ప్రారంభోత్సవాలు ఎలా చేస్తారు’? అంటూ స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డిని సైతం నిలదీశారు. గతంలో మనం ఏ పార్టీలో ఉన్నా, కలిసి పనిచేసే వాళ్లమని, మరి ఇప్పుడెందుకు సరైన సమాచారం ఇవ్వకుండా హడావుడిగా ప్రారంభోత్సవాలు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందని నిలదీశారు.
అయితే, మరోసారి ఇలా జరుగకుండా చూసుకుందామని చీఫ్ విప్ చెప్పడంతో సమస్య సద్దుమనిగింది. అయితే, ప్రగతినగర్ కమాన్ వద్ద సీసీ రోడ్ల ప్రారంభోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి యత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను శాంతింపజేశారు. అయితే బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించి తోసివేశారని, కొందరు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల చొక్కాలను సైతం చించివేశారని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేక్కడిని న్యాయమని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒకనీతి తమకో నీతా అంటూ పోలీసులను ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి
ఎమ్మెల్యే వివేకానంద్
బీఆర్ఎస్ పాలనలోనే నిజాంపేట్ కార్పొరేషన్‌ను కోట్లాది రూపాయల నిధులతో మోడ్రన్ కార్పొరేషన్‌గా అభివృద్ధి చేశామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు. సోమవారం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీల్లో సుమారు రూ.8.69 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్డు, బీటీ రోడ్డు, భూగర్భ డ్రైనేజీ పనులను ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు చోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్‌ను మోడ్రన్ కార్పొరేషన్‌గా అభివృద్ధి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొలన్ నీలాగోపాల్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, నిజాంపేట మున్సిపల్ కమిషనర్ సాబేర్ అలీ,కార్పొరేటర్లు బాలాజీ నాయక్, గాజుల సుజాత ప్రణయ ధనరాజ్ యాదవ్, ఆగంరాజు తదితరులు పాల్గొన్నారు.