అమీర్‌పేట్, జనవరి 23: ఓ ప్రైవేట్ స్కూల్ లో ఇంటర్వ్యూకి వెళ్లిన మహిళపై లైంగిక దాడికి యత్నించిన పాఠశాల కరస్పాండెంట్‌పై సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సనత్‌నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు తెలిసిన వివరాల ప్రకారం.. బాలానగర్‌లో నివాసముంటున్న యువతి(28) ఈనెల 21న ఉద్యోగాన్వేషణలో భాగంగా లోకల్ యాప్‌లో తన ప్రొఫైల్ పెట్టి దరఖాస్తు చేసుకుంది.
ఫతేనగర్‌లోని వశిష్ట స్కూల్లో ఇంటర్వ్యూ ఉందని తెలియడంతో గురువారం స్కూల్‌కు వెళ్లింది. యువతిని కరస్పాండెంట్ నౌబత్తుల వెంకటరమణ తనను తాను పరిచయం చేసుకుని ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇంటర్వ్యూలో యువతికి రూ. 20 వేల వేతనం ఇస్తానని, ఇందుకు స్కూల్‌కు వచ్చే ఫోన్‌కాల్స్ రిసీవ్ చేసుకోవడం, పాఠశాలను సందర్శించే విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడటంతోపాటు తనకు వ్యక్తిగత సహాయకురాలిగా పని చేయాల్సి ఉంటుందని చెప్పాడు.
ఆ తరువాత వ్యక్తిగత విషయాలను వివరిస్తూ తనకు 20 ఏండ్లుగా లైంగిక జీవితం లేదంటూ వ్యాఖ్యానించాడు. గది తలుపులు మూసి ఆమెను అసభ్యకరంగా తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతడి చర్యలను యువతి తన మొబైల్ ఫోన్లో చిత్రించేందుకు ప్రయత్నిస్తుండగా బాధితురాలి చేతుల్లో నుంచి ఫోన్‌ను బలవంతంగా లాక్కున్నాడు. వెంటనే ఆమె బయటకు వచ్చి సనత్‌నగర్ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు నిందితుడు వెంకటరమణపై కేసు నమోదు చేశారు.