బంజారాహిల్స్,జూలై 24: నగరం నడిబొడ్డున ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు ప్రైవేట్ వ్యక్తుల ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నం 10లోని క్యాన్సర్ ఆస్పత్రి ఎదురుగా జలమండలి తట్టిఖానా రిజర్వాయర్ పక్కనున్న 5 ఎకరాల స్థలంలో 1.20 ఎకరాల స్థలాన్ని జలమండలి కోసం కేటాయించగా మిగిలిన 3.20 ఎకరాల స్థలం రెవెన్యూశాఖ అధీనంలో ఉంది.
ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు గత కొన్నేళ్లుగా పరుశరామ్ పార్థసారథితో పాటు పలువురు ప్రైవేటు వ్యక్తులు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆక్రమణలకు సంబంధించి గతంలోనే పరుశరామ్ పార్థసారథితో పాటు అతడి కొడుకు విజయ్ భార్గవ్ మీద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు స్థలం వద్దకు వచ్చి ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను తొలగించారు. రేకుల షీట్ల మీద ఉన్న హెచ్చరిక బోర్డులను తుడిపివేశారు.ఈ స్థలం వీఆర్ ఇన్ఫ్రా సంస్థకు చెందినదంటూ బోర్డులను ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ హెచ్చరిక బోర్డు ఏర్పాటు..
సమాచారం అందుకున్న షేక్‌పేట మండల రెవెన్యూ సిబ్బంది గురువారం మధ్యాహ్నం అక్కడకు చేరుకుని వీఆర్ ఇన్ఫ్రా సంస్థ పేరుతో ఏర్పాటు చేసిన బోర్డును తొలగించి ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను మరలా ఏర్పాటు చేశారు. సుమారు రూ.350 కోట్ల విలువైన ఈ స్థలంతో పాటు పక్కనున్న 1.20 ఎకరాల జలమండలి స్థలం మొత్తం రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వానిదే అని స్పష్టంగా ఉందని, నాన్ ఎగ్జిస్టింగ్ సర్వే నంబర్లతో లేనిపోని వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్న వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని షేక్‌పేట మండల తహసీల్దార్ అనితారెడ్డి సూచించారు.
కొత్తవారితో కోర్టులో కేసులు..!
ఇదిలా ఉండగా గత కొన్నేళ్లుగా ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు రకరకాలైన పేర్లతో, పత్రాలతో ప్రయత్నాలు చేస్తున్న పార్థసారథి అనే వ్యక్తిపై ఇప్పటికే బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో నాలుగు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కాగా ఈ స్థలంపై తమకు అగ్రిమెంట్లు ఉన్నాయని నమ్మిస్తూ గతంలోనే కొంతమంది వద్దనుంచి లక్షల్లో అడ్వాన్స్‌లు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. బెంగళూరుకు చెందిన ఓ ప్రముఖ బిల్డర్‌తో పాటు నగరానికి చెందిన పలువురి వద్దనుంచి ఈ స్థలాన్ని చూపిస్తూ కొంత మొత్తాన్ని అడ్వాన్స్‌గా తీసుకునే ప్రణాళికలో భాగంగానే పలుమార్లు ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను తొలగించినట్లు తెలుస్తోంది.
కాగా గతంలో పార్థసారథి మీద కేసులు నమోదు కావడంతో కొత్త వ్యక్తులను రంగంలోకి దించి వారిపేరుమీద కోర్టుల్లో కేసులు వేయిస్తున్నాడని, కోర్టులో స్టే పేరుతో స్థలంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఆయా కేసుల్లో ఉన్న సర్వే నంబర్లతో బంజారాహిల్స్ రోడ్ నం 10లోని క్యాన్సర్ ఆస్పత్రి స్థలంతో సంబంధం లేదని రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. లేని స్థలాన్ని చూపిస్తూ మోసం చేసేందుకు యత్నిస్తున్న వారితో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.