బంజారాహిల్స్, డిసెంబర్ 24: బంజారాహిల్స్ రోడ్ నం. 13(ఏ)లోని అంబేద్కర్‌నగర్ బస్తీలో అంగన్వాడీ కేంద్రం కోసం కేటాయించిన స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నిస్తున్న వారిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబేద్కర్‌నగర్‌లో 50 గజాల స్థలాన్ని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ నిర్మాణం కోసం కేటాయించారు. స్థలంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.
కాగా కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఈ స్థలాన్ని తాము కొనుగోలు చేశామంటూ మంగళవారం సాయంత్రం అక్రమంగా ప్రవేశించడంతో పాటు ఐసీడీఎస్ బోర్డును తొలగించి ప్రైవేటు స్థలం అంటూ బోర్డులు పెట్టారు. అక్కడే టెంట్ వేసి బస్తీవాసులను బెదిరింపులకు గురిచేశారు. ఐసీడీఎస్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ పుష్పావతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.