మలక్ పేట, ఏప్రిల్ 8: సన్న బియ్యం బదులు దొడ్డు బియ్యం ఇవ్వగా ఇదేమని ప్రశ్నించిన పాపానికి ఓ లబ్ధిదారుడిపై దాడి చేశారు. ఈ ఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు పాత మలక్‌పేటకు చెందిన ఆటో డ్రైవర్ కత్తుల రవి సోమవారం ఉదయం ఆస్మాన్ ఘడ్లోని పౌరసరఫరాల పంపిణీ దుకాణం నం.111కు వెళ్లి సన్న బియ్యం ఇవ్వమని అడిగాడు.
అయితే షాపు నిర్వాహకుడు శ్రీను దొడ్డుబియ్యం ఇస్తుండటంతో ఇదేమని ప్రశ్నించగా.. అందుకు డీలర్ శ్రీను ఎలక్షన్ కోడ్ ఉన్నందున తాను సన్న బియ్యం ఇవ్వలేనని, దొడ్డు బియ్యమే ఇస్తానని తెలిపారు. అన్ని షాపుల్లో సన్న బియ్యం ఇస్తున్నారని, మీరెందుకు ఇవ్వరని నిలదీయడంతో ఇష్టముంటే దొడ్డు బియ్యం తీసుకెళ్లు లేకుంటే లేదు అని డీలర్ దురుసుగా సమాధానం ఇచ్చాడు.
ఇంతలో డీలర్ శ్రీను పక్కనే ఉన్న రాజు అనే వ్యక్తి జోక్యం చేసుకొని రవితో గొడవకు దిగి చెంపపై కొట్టాడు. దాంతో అక్కడే ఉన్న మరి కొంతమంది కార్డుదారులు జోక్యం చేసుకొని రాజును నిలదీయడంతో డీలర్ అతన్ని అక్కడి నుంచి పంపించి వేశాడు. జరిగిన ఘటనపై రవి మలక్ పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.