తుపాకులతో గుర్తుతెలియని దుండగులు దాడి
మృతులిద్దరూ పాతనేరస్తులే..?
భూమి పంచాయితే కారణమా.?
పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
పోలీసుల అదుపులో అనుమానితులు
రంగంలోకి 5 ప్రత్యేక బృందాలు
ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీపీ మహేశ్‌భగవత్
సిటీబ్యూరో, మార్చి 1(నమస్తే తెలంగాణ) / ఇబ్రహీంపట్నం/వనస్థలిపురం: నగర శివారు ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడ గ్రామ సమీపంలో మంగళవారం కాల్పుల ఘటన కలకలం రేపింది. స్కార్పియో వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్ర గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందారు. భూ దందాలతో పెరిగిన వైరంతోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే..
అల్మాస్గూడ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేంద్ర రెడ్డి మంగళవారం ఉదయం పటేల్‌గూడలో వారు డెవలప్మెంట్ చేస్తున్న వెంచర్ వద్దకు వెళ్లారు. 8 గంటల ప్రాంతంలో అక్కడే ఉన్న మట్టారెడ్డితో మాట్లాడారు. 8:30 గంటల ప్రాంతంలో స్కార్పియో వాహనంలో అక్కడి నుంచి బయలుదేరారు. కర్ణంగూడ గ్రామ శివారులోకి రాగానే గర్తుతెలియని వ్యక్తులు స్కార్పియో వాహనంపై తుపాకులతో దాడికి దిగారు. ఈ ఘటనలో స్కార్పియో నడుపుతున్న రాఘవేంద్ర రెడ్డి ఛాతిలోకి బుల్లెట్ దిగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. తర్వాత శ్రీనివాస్ రెడ్డి కారు దిగి పారిపోతుండగా.. షాట్ వెపన్తో పాయింట్ బ్లాక్‌లో కాల్చారని సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
పోలీసుల అదుపులో అనుమానితులు..
ఈ సంఘటనకు సంబంధించి రాచకొండ పోలీసులు మొదటగా మట్టారెడ్డితో పాటు శ్రీనివాస్‌రెడ్డి అనుచరుడు హఫీజ్, డ్రైవర్ కృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేంద్రరెడ్డిలు ఈ ఏడాది జనవరి నెలలో కర్ణంగూడకు చెందిన ఇంద్రారెడ్డి, నరసింహరెడ్డి, పురుషోత్తం రెడ్డిలకు చెందిన 8 ఎకరాల భూమిని అభివృద్ధి చేసి అప్పగించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగానే గత మూడు నెలలుగా శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేంద్ర రెడ్డి ప్రతి రోజు ఉదయం వెంచర్ వద్దకు వస్తూ వెళ్తుండే వారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం వెంచర్ వద్దకు రాగా.. గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో మృతి చెందారు. ఇదిలా ఉండగా.. ప్రతి రోజు శ్రీనివాస్‌రెడ్డి వెంట ఉండే అనుచరుడు హఫీజ్, డ్రైవర్ కృష్ణ మంగళవారం రాలేదు. దీంతో వారిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసు లు ఇద్దరినీ అదపులోకి తీసుకుని విచారించారు. అయితే ‘జగ్నే కీ రాత్’ ఉండటంతో రాలేకపోయానని హఫీజ్ తెలుపగా.., శ్రీనివాస్‌రెడ్డి వద్దనడంతో రాలేదని కృష్ణ తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇటీవల ప్లాట్ల యజమానులు పోలీసులకు ఫిర్యాదు
18 ఎకరాలకు సంబంధించి ప్లాట్లు కొన్న వారు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ప్లాట్లను కొందరు ఆక్రమిస్తున్నారని, రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేశారు.
తుపాకులతో..
శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేంద్రరెడ్డిలపై కాల్పులకు పాల్పడిన దుండగులు ఓ గ్యాంగ్‌గా వచ్చి ఉంటారని తెలుస్తున్నది. వారిని చూసి పారిపోయే క్రమంలో వెంబడించి దాడి జరిపినట్లు తెలుస్తున్నది. శ్రీనివాస్ రెడ్డిని షాట్ వెపన్తో కాల్పడంతో అతడి తలపై ఏడు బలమైన గాయాలు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. రాఘవేంద్ర రెడ్డిపై తుపాకీతో కాల్పులు జరుపగా బుల్లెట్ అతడి ఊపిరితిత్తుల్లో ఇరుక్కు పోయినట్లు వైద్యులు గుర్తించారన్నారు.
రెవెన్యూ రికార్డుల్లో పేర్లే కారణమా.?
ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడ గ్రామం సర్వే నం. 1369, 1371, 1372లో ఇంద్రారెడ్డి, నరసింహారెడ్డి, పురుషోత్తం రెడ్డిలకు 18 ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలాన్ని 20 ఏండ్ల కిందట లేక్‌విల్లా రిసార్ట్స్ యాజమాన్యానికి విక్రయించారు. లేక్‌విల్లా రిసార్ట్స్ నిర్వాహకులు అందులోని 18 ఎకరాల్లో వెయ్యి గజాల చొప్పున ప్లాట్లు చేసి విక్రయించారు. తాజాగా ఈ ముగ్గురి పేరు మీద (ఇంద్రారెడ్డి, నరసింహారెడ్డి, పురుషోత్తం రెడ్డి) రెవెన్యూ రికార్డులో భూమి ఉన్నట్లు వచ్చింది. దీంతో అందులోని 8 ఎకరాల భూమిని తిరిగి వ్యవసాయ భూమి కింద మార్చి ఇవ్వాలని శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేంద్రరెడ్డిలతో ఒప్పందం కుదుర్చున్నారు. అయితే మట్టారెడ్డి కొన్ని ప్లాట్లను కొనుగోలు చేసి చుట్టూ ప్రహరీ నిర్మించుకున్నాడు. మిగతా ప్లాట్లకు చెందిన స్థలం విషయంలో వీరికి విబేధాలు తలెత్తాయని గ్రామస్తులు తెలిపారు. ఈ విషయమై పోలీసులు గ్రామస్తులను, రెవెన్యూ అధికారులను ఆరా తీస్తున్నారు. అయితే ఇంద్రారెడ్డి, నరసింహారెడ్డి, పురుషోత్తం రెడ్డిలను కూడా పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.
మట్టారెడ్డితో విబేధాలు..?
శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేంద్రరెడ్డి చేస్తున్న డెవలెప్మెంట్ స్థలం పక్కనే మట్టారెడ్డికి ఓ ఎకరం స్థలం ఉంది. అయితే పలు సందర్భాల్లో మట్టారెడ్డికి వీరికి మధ్యన విబేధాలు ఉన్నాయని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు మట్టారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వీరికి ఎవరై శత్రువులు ఉన్నారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐదు ప్రత్యేక బృందాలు మిస్టరీని ఛేదించేందుకు రంగంలోకి దిగాయి. క్లూస్, డాగ్ స్కాడ్ బృం దాలు కూడా ఆధారాలు సేకరిస్తున్నాయి. రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
మృతులపై గతంలోనే కేసు..
కాల్పుల సంఘటనలో మృతిచెందిన శ్రీనివాస్‌రెడ్డిపై సెటిల్మెంట్లకు సంబంధించి, బంధువుపై దాడి చేసిన కేసులున్నాయి. రాఘవేంద్ర రెడ్డి జంట హత్యల కేసులో జైలు శిక్ష అనుభవించినట్లు తెలిసింది. జైలు నుంచి వచ్చిన అనంతరం రెండేండ్ల కిందట రాఘవేంద్రరెడ్డి ఓ మహిళా న్యాయవాదిని వివాహం చేసుకున్నాడు. ఇటీవల వీరు ల్యాండ్ సెటిల్మెంట్లు చేయడంతో పాటు రియల్ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు సమాచారం.