బొల్లారం, మే 3: బ్యాంకులకు సెలవు రోజును ఎంచుకుని భద్రతా సిబ్బంది లేని ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుని కొత్త తరహ దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగలను తిరుమలగిరి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి రూ.70 వేల నగదు తో పాటు కారును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ రమేశ్ తెలిపారు. యూపీకి చెందిన అతిక్ అహ్మద్, మహమ్మద్ డానిష్ ఓలాలో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు.
యూపీకి చెందిన వీరు ముంబైలో నివాసం ఉంటున్నట్లు ముంబైలోనే ఈ తరహా దొంగతనాలకు ప్రణాళిక రచించినట్లు పోలీసులు తెలిపారు. గత నెల 27 న ఉదయ 7 గంటల సమయంలో ఆర్టీఏ కార్యాలయం సమీపంలోని ఎస్బీఐ బ్యాంక్ వద్ద ఉన్న ఏటీఎంలో నగదు విత్ డ్రా కోసం వచ్చే వినియోగదారులను తప్పుదోవ పట్టించి నగదును అపహరించినట్లు తెలిపారు.
ఏటీఎం లలో నగద విత్ డ్రా చేసే సమయంలో డిస్పెన్సర్ కు టేపు అతికించి డబ్బులు రాకుండా ఇరుక్కుపోయేలా చేసినట్లు పేర్కొన్నారు. వినియోగదారులు అక్కడి నుంచి వెళ్లిన వెంటనే టేపును తొలగించి డబ్బులు తీసుకున్నట్లు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించినట్లు తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బ్యాంకు అధికారులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా ఒకేరోజు 12 సార్లు దొంగతనం జరిగినట్లు గుర్తించారు. సమావేశంలో డీఐ శివ రావు, ఎస్సై ప్రశాంత్,సిబ్బంది పాల్గొన్నారు.