సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ): ఏటీఎంలలో దోపిడీకి పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న అంతర్రాష్ట హర్యాన గ్యాంగ్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.17లక్షల నగదు, నాలుగు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ మేరకు గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలానగర్ జోన్ డీసీపీ కె.సురేష్‌కుమార్, క్రైమ్ డీసీపీ ఎ.ముత్యంరెడ్డితో కలిసి కేసు పూర్వాపరాలను వెల్లడించారు. ఈనెల 8న అర్థరాత్రి 2.30గంటల సమయంలో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్కండేయనగర్లో ఉన్న హెచ్డీఎఫ్సీ ఏటీఎంను గుర్తుతెలియని దుండగులు గ్యాస్ కట్టర్‌తో పగులగొట్టి, అందులో ఉన్న రూ.34.71లక్షల నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనపై బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
జైలులో పరిచయాలు…
నిందితులు గతంలో కూడా దేశవ్యాప్తంగా 30కి పైగా దొంగతనాలు, దోపిడీలు, ఏటీఎం దోపిడీలు, ఇళ్లు, వాహనాల దోపిడీలకు పాల్పడి పలు మార్లు జైలుకు వెళ్లారు. ఈ క్రమంలోనే యాసిబ్ హుస్సేన్ మధ్యప్రదేష్లోని కొత్వాలి పోలీస్‌స్టేషన్‌లో అరెస్ట్ అయ్యాడు. దీంతో అతడికి ఏడేళ్లు జైలు శిక్ష పడగా నిందితుడిని హరియాణలోని నార్నౌల్ జిల్లా జైలుకు బదిలీ చేశారు. కాగా అమిర్ అన్సారీ పోక్సో కేసులో అరెస్టవగా అతడికి 20ఏళ్లు జైలు శిక్ష పడింది.
ఈ క్రమంలో అన్సారీ, యాసిబ్లకు జైలులో పరిచయం ఏర్పడింది. ఇటీవలే బెయిల్‌పై విడుదలైన నిందితులిద్దరూ మరో ఇద్దరితో కలిసి ఏటీఎంలు, వాహనాలు, ఇళ్లలో దోపిడీలకు పాల్పడటం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే నగరానికి చేరుకున్న నిందితులు ఇద్దరు మహ్మద్ అబెద్, మరో వ్యక్తితో కలిసి నగరంలోని నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంలపై దృష్టిపెట్టి రెక్కీ నిర్వహించారు. గుమ్మడిదల పీఎస్ పరిధిలో నుంచి రెండు ద్విచక్రవాహనాలను దొంగిలించి వాటిపై తిరుగుతూ ఈనెల 8న అర్ధరాత్రి 2.30గంటల సమయంలో జీడిమెట్ల లోని మార్కండేయ నగర్‌లోని హెచ్డీఎఫ్సీ ఏటీఎంకు చేరుకున్నారు.
ఏటీఎంలోనికి వెళ్లిన నిందితులు ముందుగా సీసీ కెమెరాల కనెక్షన్‌ను కట్‌చేశారు. అనంతరం గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను పగులగొట్టి, అందులో ఉన్న 34.71లక్షల నగదును తీసుకుని ద్విచక్ర వాహనాలపై కామారెడ్డికి పరారయ్యారు. అక్కడ మరో బైక్ దొంగిలించి ఆదిలాబాద్‌కు చేరుకున్నారు. ఆదిలాబాద్‌లో రెండు గ్రూపులుగా విడిపోయిన ఈ గ్యాంగ్ ట్రక్కులు ఎక్కి తమ స్వస్థలాలకు పరారయ్యారు.
500 సీసీ టీవీలను జల్లడ పట్టి..
సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి ఆదేశాల మేరకు ఏటీఎం దోపిడీకి పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు బాలానగర్ జోన్ పోలీసులతో పాటు మేడ్చల్, బాలానగర్, శంషాబాద్ సీసీఎస్ బృందాలు రంగంలోకి దిగి 500 సీసీ టీవీలను జల్లెడ పట్టాయి. ఈ క్రమంలో నిందితుల ఆనవాళ్లను గుర్తించిన పోలీసులు ఘటన జరిగిన తీరుతో సరిపోల్చడంతో దోపిడికి పాల్పడింది హర్యానా గ్యాంగ్‌గా నిర్ధారణకు వచ్చారు.
ఈ క్రమంలో సీసీ పుటేజిల ఆధారంగా తొలుత నగరానికి చెందిన అమిర్ అన్సారీ(24)ను అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు సైబరాబాద్ ప్రత్యేక బృందం హర్యానాకు వెళ్లి, స్థానిక పోలీసుల సహకారంతో దోపిడీలో కీలక పాత్ర పోషించిన అక్కడి పల్వాల్ జిల్లాకు చెందిన యాసిబ్ హుస్సేయిన్(28), మహ్మద్ అబెద్ను అరెస్టు చేసి నగరానికి తీసుకువచ్చారు. నిందితుల వద్ద నుంచి రూ.17లక్షల నగదు, 4 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా ఘటన జరిగిన వారం రోజుల్లోనే ఇతర రాష్ర్టానికి వెళ్లి నిందితులను పట్టుకోవడమే కాకుండా వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో చోరీ చేసిన సొత్తును రికవరీ చేయడంలో కీలక పాత్ర పోషించిన మేడ్చల్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ దాలి నాయుడు, సీసీఎస్ బాలానగర్ బృందం, శంషాబాద్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఎం.పవన్, జీడిమెట్ల ఎస్హెచ్ఒ జి.మల్లేష్, డిఐ కనకయ్య, బాలానగర్ డిఐ నాగిరెడ్డి తదితరులను ఉన్నతాధికారులు అభినందించారు. ఈ సమావేశంలో సీసీఎస్ అదనపు డీసీపీ రామ్‌కుమార్, బాలానగర్ జోన్ అదనపు డీసీపీ పి.సత్యనారాయణ, క్రైమ్ ఏసీపీ వై.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.