ATF Tennis Tourney | బంజారాహిల్స్, జూన్ 22 : ఏషియన్ టెన్నిస్ ఫెడరేషన్(ఏటీఎఫ్)ఆధ్వర్యంలో దక్షిణాసియా గ్రేడ్ ఏ టెన్నిస్ పోటీలను మంత్రి వాకిటి శ్రీహరి ఆదివారం జూబ్లీహిల్స్‌లోని జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్లో ప్రారంభించారు. భారత్‌తో పాటు అమెరికా, థాయ్‌లాండ్, మలేషియా, ఇండోనేషియా, ఉజ్బెకిస్తాన్, న్యూజిలాండ్ సహా 16 దేశాలనుంచి వర్థమాన టెన్నిస్ క్రీడాకారులు అండర్ 14 కేటగిరిలో తలపడనున్నారు. జూన్ 29 వరకు టోర్నమెంట్ కొనసాగుతుందని, ఆసియా టాప్ -10 క్రీడాకారులు సైతం ఈ పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా అంతర్జాతీయ టోర్నమెంట్ రావడం సంతోషంగా ఉందన్నారు. దేశంలోని యువ క్రీడాకారులు అంతర్జాతీయ పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్శించేందుకు అవకాశం లభిస్తుందన్నారు. తనకు చిన్నప్పటినుంచి క్రీడలపై ఆసక్తి ఉందని, క్రికెట్లో తాను ఫాస్ట్ బౌలర్‌గా ఉన్నాన్నారు. మాజీ భారత క్రికెటర్ అజారుద్దీన్ తనకు సీనియర్‌గా ఉండేవాడన్నారు. ప్రస్తుతం యువత తమ సమయాన్ని వృధా చేస్తున్నారని, క్రీడలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారుడు ఏపీ జితేందర్‌రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, కార్యదర్శి కిలారు రాజేశ్వర్‌రావు, ప్రవీణ్‌రెడ్డి, రామకృష్ణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.