సిటీబ్యూరో, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ ): ఒకవైపు వేల కోట్లు విలువ చేసే భూములను పెద్దలకు ధారపోస్తున్న కాంగ్రెస్ సర్కారు.. అదే సమయంలో హైడ్రా పేరిట సామాన్యుడి ఇండ్లపైకి బుల్డోజర్లను ఎగదోస్తుంది. సుమారు 798 ప్రాంతాల్లో ఆక్రమణల పేరుతో కూల్చివేసిన ప్రభుత్వ యంత్రాంగం.. బడా బిల్డర్లు చేసిన ఆక్రమణల జోలికి మాత్రం పోయేందుకు వెనకడుగు వేస్తోంది. కానీ నిరుపేదలు అప్పులు చేసిన మరీ నిర్మించుకున్న కలల సౌధాలను నేలమట్టం చేస్తున్న ప్రభుత్వం.. తన సన్నిహితులు చేస్తున్న భూ ఆక్రమణల పట్టించుకోవడమే లేదు. ఓవైపు ప్రజాపాలన అంటూనే,మరోవైపు భూదాహంతో రగిలిపోతూ సామాన్యుడికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చివరకు చిరు వ్యాపారస్తులను వదలని తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
అధికారుల పరుగులు..
రహదారుల విస్తరణ, ఫుట్‌పాత్‌ల క్లీనింగ్ ముసుగులో రోడ్లపై చిరు వ్యాపారం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునే వేలాది మందిపై కక్ష సాధింపు చర్యగా జీహెచ్ఎంసీ అధికారులు శనివారం పొద్దుపొద్దునే బుల్డోజర్లు, జేసీబీల మరయంత్రాలను రంగంలోకి దింపి వారిపై ప్రతాపం చూపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో 798 (పర్మినెంట్ 340, తాత్కాలికమైనవి 458) వ్యాపారస్తుల వ్యాపారాలను చెల్లాచెదురు చేసి వారి జీవితాలను అంధకారంలోకి నెట్టారు.
ఒక్కరోజే ఏకంగా 798 ఆక్రమణలు తొలగించినట్లు అధికారులు గొప్పగా చెబుతున్నప్పటికీ అందులో అత్యధికంగా ఉన్న 458 తాత్కాలిక షెడ్లు, బండ్లు, చిరువ్యాపారులవే కావడం గమనార్హం. మోండా మార్కెట్, ఆరాంఘర్, మదీనా వంటి రద్దీ ప్రాంతాల్లో వ్యాపారస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ పోలీసులు, అధికారుల బలగంతో వారిని అణిచివేసి కూల్చివేతలు జరిపించారు .కాగా ముందస్తుగా ఎలాంటి నోటీసులు లేకుండా, ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా ఒక్కసారిగా యంత్రాలతో విరుచుపడడంతో ఏళ్ల తరబడి రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటున్న కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కూల్చివేతల్లో భాగంగా పాతబస్తీలోని లాడ్‌బజార్, రికబ్‌గంజ్ రోడ్ వంటి ప్రాంతాల్లో ఏళ్ల తరబడి కొనసాగుతున్న చిన్న చిన్న దుకాణాలను సైతం కనికరం లేకుండా తొలగించారు.
ఖైరతాబాద్, రాజేంద్రనగర్ పరిధిలో శ్రీనగర్ కాలనీ, ఆరాంఘర్ వరకు ప్రధాన రహదారులపై ఉన్న తోపుడు బండ్లు, చిన్నపాటి డబ్బాలను బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. కొంత సమయం ఇవ్వండి అని వేడుకున్నా అధికారులు వినలేదు.. బుల్డోజర్లకు అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు..సికింద్రాబాద్ మోండా మార్కెట్లో జరిపిన కూల్చివేతలను బాధిత వ్యాపారస్తులంతా ముక్తకంఠంగా నిరసన తెలుపుతూ అడ్డుకున్నారు. స్వల్ప వ్యవధిలోనే వందల మంది చేరుకుని అధికారుల విధులకు అడ్డుతగిలారు. షాపులను ఎలా తొలగిస్తారో చూస్తామంటూ జేసీబీలకు ముందు నిలబడి ఆందోళన జరిపారు. అధికారులను ఘెరావ్ చేశారు. ట్రాఫిక్ పోలీసులను సైతం నిరసనలకు వెనక్కి తగ్గారు. అక్కడితో ఆగకుండా వ్యాపారస్తుంలా మోండా పోలీస్‌స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. సంవత్సరాలుగా వ్యాపారాలు చేసుకుంటుంటే మమ్మల్ని ఎక్కడికి వెళ్లమంటారో చెప్పండి అంటూ పోలీసులను నిలదీశారు.
కాంగ్రెస్ పోతేనే దర్రిదం పోతది: బాధిత వ్యాపారులు
కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తరువాతే ఫుట్‌పాత్ వ్యాపారులను ఇబ్బంది పెడుతున్నారని, తమ జీవితాలు రోడ్డున పడేస్తున్నారని వ్యాపారులు రోడ్డుపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదని, కాంగ్రెస్‌ను గెలిపిస్తే తమ నోర్లు కొడుతున్నారని మోండా మార్కెట్ వద్ద బాధిత వ్యాపారస్తులు ఆందోళనకు దిగారు. దశాబ్దాల కాలంగా ఇక్కడ వ్యాపారం చేసుకొని బతుకుతున్నామని, ఇప్పుడు కొత్తగా పెట్టుకోలేదని ఫుట్‌పాత్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఇలాంటి గవర్నమెంట్‌ను మేము ఎప్పుడూ చూడలేదని, కాంగ్రెస్ గవర్నమెంట్ దిగిపోతేనే దరిద్రం పొతదని రోదించారు. పరిస్థితి చేయిదాటి పోతుందని భావించిన అధికారులు జేసీబీలను తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అర్ధగంట టైం అడిగినా కనికరించ లేదు..
దుకాణాల్లోని వస్తువులను తీసుకునేందుకు కనీసం అర్ధగంట సమయం ఇవ్వాలని వేడుకున్నా వినకుండా కూల్చివేశారు. ఓ హైకోర్టు అడ్వకేట్ బాధితుల పక్షాన అధికారులను వేడుకున్నా వినిపించుకోలేదు. బాధితులను అర్ధగంటలో ఖాళీ చేయించే బాధ్యత తనదని, దయచేసి సమయం ఇవ్వాలని వేడుకున్నారు. ఆమె అభ్యర్థనను ఏమాత్రం పట్టించుకోని అధికారులు హైకోర్టు, సుప్రీం కోర్టు ఆర్డర్స్ ఉన్నాయని.. ఒక్క క్షణం కూడా ఆగేది లేదని కూల్చివేతలు కొనసాగించారు. కనీసం 30 నిమిషాలు సమయం ఇస్తే దుకాణాల్లో ఉన్న వస్తువులనైనా తీసుకుంటారని విన్నవించారు. ఇష్టానుసారం కూల్చడం వల్ల వస్తువులు ధ్వంసమై ఆర్థికంగా చితికిపోతారని బతిమిలాడినా వినిపించుకోలేదు. తొందరగా కూల్చాలని బుల్డోజర్ డ్రైవర్లను ఆదేశించండంతో నేలమట్టం చేశారు.
తమాషా చేస్తున్నారా? ఎమ్మెల్సీ గరం.. గరం
మదీనా, ముర్గీచౌక్ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు కొనసాగించిన కూల్చివేతలను ఎంఐఎం ఎమ్మెల్సీ రెహ్మాత్ బేగ్, పత్తర్ ఘట్టి కార్పొరేటర్ సోహెల్ ఖాద్రీ అడ్డుకున్నారు. ఓవైపు ఆక్రమార్కులకు కొమ్ముకాస్తున్న అధికారులు చిన్న చితకా పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న చిరు వ్యాపారులపై జులుం ప్రదర్శించడం సమంజసం కాదని అధికారులు వ్యవహారాన్ని ప్రశ్నించారు. దీంతో కొద్దిసేపు మదీనా, ముర్గీచౌక్ ప్రాంతాల్లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కూల్చివేతలకు ఉపయోగించే బుల్డోజర్, జేసీబీ వాహనాలపైకి చేరుకున్న నేతలు అధికారుల చర్యలను నిలదీస్తూ ఇప్పటి వరకు జారీ చేసిన నోటీసులు ఎక్కడంటూ ప్రశ్నించారు. జేబీసీ డ్రైవర్‌తో పాటు జీహెచ్ఎంసీ అధికారులపై ఎమ్మెల్సీ బేగ్ తమషా చేస్తున్నారా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో అధికారులు వెనక్కి తగ్గి కూల్చి వేతలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నామని ప్రకటించారు.