సిటీబ్యూరో, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): వేసవి ఆరంభంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండల తీవ్రత పెరిగే కొద్దీ కరెంటు వినియోగం గణనీయంగా పెరుగుతున్నది. ఇందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాల్సిన విద్యుత్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు సమ్మర్ యాక్షన్ ప్లాన్ పేరుతో ఈనెల 10 వరకు చెట్ల నరికివేతకే పరిమితమయ్యారు. వేసవిలో డిమాండుకు అనుగుణంగా నిరంతర నాణ్యమైన విద్యుత్ కోసం ప్రత్యేకంగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లలో పవర్ ట్రాన్స్ఫార్మర్లతో పాటు కొత్త లైన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ వేసవికి ముందుగానే ఏర్పాటు చేయకపోతే గ్రేటర్‌కు వేసవిలో విద్యుత్ షాక్ తప్పని పరిస్థితి ఉన్నది. పెరుగుతున్న విద్యుత్ డిమాండుకు అనుగుణంగా కార్యాచరణ లేకపోవడంతో సరఫరాలో అంతరాయాలు వినియోగదారులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి.
ఫిబ్రవరి నెల ప్రారంభం నుంచే చలి తీవ్రత తగ్గి.. ఎండలు క్రమంగా ప్రారంభమయ్యాయి. అయితే విద్యుత్ డిమాండుకు అనుగుణంగా పవర్ ట్రాన్స్ఫార్మర్లు, అదనపు లైన్ల ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్ల కేపాసిటీ పెంచడం వంటి చర్యలు చేపట్టేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎండీ నుంచి మొదలు కొని డైరెక్టర్ల వరకు అందరూ మారడం.. ప్రభుత్వ హామీల్లో ఒకటైన ఉచిత విద్యుత్ పథకం అమలుపైనే అధికార యంత్రాంగమంతా దృష్టి సారించి పనిచేయడం వల్ల కూడా వేసవి కార్యాచరణపై దృష్టి పెట్టలేదు. ఇప్పటికే ఈ ప్రక్రియ ఆలస్యమవ్వగా.. టీఎస్ఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ శుక్రవారం డిస్కం పరిధిలోని డైరెక్టర్లు, సీజీఎంలు, ఎస్ఈలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వేసవి కార్యాచరణను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా చూడాలని ఆదేశించారు.
వేసవిలో నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలంటే ప్రస్తుతం ఉన్న ట్రాన్స్ఫార్మర్లకు అదనంగా సుమారు 1500 ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. సబ్ స్టేషన్లలో సుమారు 45 అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్లు, కొత్తగా 450 కి.మీ మేర విద్యుత్ లైన్లు అవసరం. సింహభాగం విద్యుత్ వినియోగం సైబర్ సిటీ, రాజేంద్రనగర్, సరూర్‌నగర్, మేడ్చల్, హబ్సిగూడలో ఉంది. బంజారాహిల్స్, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్‌లలో తక్కువ డిమాండు ఉంటుందని అధికారులు గుర్తించారు. ఇందుకు అనుగుణంగానే కొత్త ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్లలో పవర్ ట్రాన్స్ఫార్మర్లు, కొత్త లైన్లను ఫిబ్రవరి నెలాఖరు నాటికి ఏర్పాటు చేయాలి. వేసవి డిమాండుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలంటే సుమారు సుమారు రూ. 500 కోట్లకు పైనే వ్యయమవుతుందని అంచనా. ఇలా వేసవి కాలమైన మార్చి, ఏప్రిల్-మే నాటికి అంతరాయం లేని విద్యుత్‌ను సరఫరా చేయాలంటే ముందుగానే అన్ని రకాల సామగ్రిని సిద్ధం చేసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.