సిటీబ్యూరో, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): వృద్ధులను ఇబ్బంది పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు హెచ్చరించారు. వృద్ధుల సంక్షేమానికి రాచకొండ కమిషనరేట్‌లో రాచకొండ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్‌తో కలిసి ‘గోల్డెన్ కేర్-మన కోసం శ్రమించిన వారికి మన సంరక్షణ’ అనే కార్యక్రమానికి గురువారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీపీ సుధీర్‌బాబు మాట్లాడుతూ వృద్ధులు సమాజానికి నిజమైన మూల స్తంభాలు, జ్ఞాన నిధులని గోల్డెన్ కేర్ ద్వారా భద్రత మాత్రమే కాదు, ఆప్యాయత, గౌరవం, ఆత్మీయతను అందిస్తున్నామన్నారు.
రాచకొండ పోలీసులు ఎల్లప్పుడు మీ కుటుంబ సభ్యుల్లా ఉంటారని అన్నారు. వృద్ధుల సహాయం కోసం సీనియర్ సిటిజన్స్ హెల్ప్‌లైన్ 14567/రాచకొండ పోలీస్ వాట్సాప్ నంబర్ 87126 6211ను సంప్రదించాలని సూచించారు. వృద్ధులు ఆర్థిక మోసాల బారిన పడకుండా అవగాహన కల్పించడం, శారీరక, మానసిక వేధింపులకు సంబంధించి కఠినంగా వ్యవహరించడం, ఎక్కడైనా వృద్ధులు పోగొట్టుకున్న వస్తువులను గుర్తించి వారికి అందజేయడంలో తమ వంతు సహకారం అందిస్తామన్నారు.
వృద్ధులను ఇబ్బంది పెట్టే ప్లిలలు, పోషించకుండా నిర్లక్ష్యంగా వహించిన వారిపై బీఆన్ఎస్ఎస్ 144 సెక్షన్ మేరకు చర్యలుంటాయని హెచ్చరించారు. కన్న తల్లిదండ్రులను ప్రతి ఒక్కరూ ఆప్యాయంగా చూసుకోవాలని వారికి కావాల్సిన ఆర్థిక సహాయం అందించాలని లేదంటే వృద్ధులు చట్టపరమైన రక్షణను కోరవచ్చని సూచించారు. గోల్డెన్ కేర్ ద్వారా వృద్ధుల సంక్షేమం, వైద్య, ఆరోగ్య, బీమా, అత్యవసర సహాయంలో పోలీసులు ఉంటారని తెలిపారు.
కమిషనరేట్‌లోని 47 పోలీస్స్టేషన్ల పరిధిలోని సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించామని వెల్లడించారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో 70 ఏండ్లు దాటిన సీనియర్ సిటిజన్లను గుర్తించి డాటా రూపొందిస్తున్నామన్నారు. మొదటి విడతలో 470 మందిని రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధులతో కలిసి గుర్తించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
సీనియర్ సిటిజన్స్ అధైర్యపడొద్దని పోలీసులు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. కార్యక్రమానికి హాజరైన వృద్ధులకు సీపీ కిట్స్‌ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు పద్మజ, ఆకాంక్ష్ యాదవ్, మనోహర్, ప్రవీణ్‌కుమార్, అరవింద్‌బాబు, సునీతారెడ్డి, ఇందిర, ఉషా విశ్వనాథ్, నాగలక్ష్మి, రమణారెడ్డిలతో పాటు సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధులు పాల్గొన్నారు.