సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ)/చర్లపల్లి : గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ డీలా పడింది. అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, ప్యారాచూట్ నేతల కలకలం… రెడ్డి వర్సెస్ బీసీ ఇలా అనేక వ్యవహారాలు చుట్టుముట్టడంతో అనేక నియోజకవర్గాల్లో పార్టీ ఖాళీ అవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా ఉప్పల్ నియోజకవర్గంలోనూ కీలక కాంగ్రెస్ నేతలు తలోదారి చూసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఏఎస్రావు నగర్ కార్పొరేటర్ దంపతులు పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆదివారం ఈ మేరకు ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. వీరితో పాటు త్వరలోనే మరో కీలక నేత కూడా రాజీనామా చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దీంతో నియోజకవర్గంలో అసలే బక్కచిక్కిన పార్టీ క్యాడర్ టికెట్ ఖరారుకు ముందే గులాబీ పార్టీ వైపు చూస్తున్నారు.
అభ్యర్థుల ప్రకటన ముందే కాంగ్రెస్ అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే మేడ్చల్-మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్, ఆయన అనుచరులు పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. ఇదే బాటలో గ్రేటర్ వ్యాప్తంగా ద్వితీయ శ్రేణి నాయకులు ఆయా నియోజకవర్గంలో కారెక్కారు. ఈ క్రమంలోనే ఉప్పల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన పీసీసీ కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషా రెడ్డి దంపతులు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి అత్యంత దగ్గరి అనుచరుడిగా సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. పార్టీని నమ్ముకుని ఇంతకాలం పనిచేసిన గుర్తింపు లేదని, పీసీసీ రేవంత్‌రెడ్డి తనకు అన్యాయమే చేశాడని సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి తన అనుచరుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం ఢిల్లీ నుంచి వచ్చిన సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి తన అనుచరులతో సమావేశమై రాజకీయ భవిష్యత్తుపై ఆదివారం ప్రకటన చేయనున్నట్లు శ్రేణులతో చెప్పారు. పార్టీలో బీసీ వర్సెస్ రెడ్డి వివాదం రోజురోజుకు ముదురుతుండటం, రేపు ఆ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలవుతున్న దరిమిలా ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేసుకుంటూ గ్రేటర్లో ఆ పార్టీ ఖాతా తెరవడం కష్టమేనని ఆ పార్టీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.