సిటీబ్యూరో, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): ఎలాంటి అనుమతి లేకుండా బ్లడ్ కాంపోనెంట్స్ తయారు చేసి, రోగులకు అనధికారికంగా విక్రయిస్తున్న నగరంలోని ఏషియన్ బ్లడ్ సెంటర్‌ను డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు సీజ్ చేశారు. ఏషియన్ బ్లడ్ సెంటర్‌కు డీసీఏ నుంచి కేవలం రక్త దాన శిబిరాలు నిర్వహించి, రక్తాన్ని సేకరించడంతో పాటు నిల్వ చేయడం, ప్రాసెస్ చేసి, ‘హోల్ హ్యూమన్ బ్లడ్’ను మాత్రమే పంపిణీ చేసేందుకు అనుమతి ఉంది. సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్, ప్యాక్డ్ ఆర్బీసీ, ప్లాస్మా వంటి కాంపోనెంట్స్ తయారీకి, వాటిని విక్రయించేందుకు అనుమతి లేదు.
కానీ ఈ కేంద్రం నిర్వాహకులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా బ్లడ్ కాంపోనెంట్స్‌ను తయారు చేయడమే కాకుండా అనధికారికంగా సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్, ఆర్బీసీ వంటి బ్లడ్ కాంపౌనెంట్స్ను రోగులకు, బ్లడ్ బ్యాంక్‌లకు విక్రయిస్తున్నట్లు ఏషియన్ బ్లడ్ సెంటర్ టెక్నీషియన్ డీసీఏ అధికారుల విచారణలో వెల్లడించాడు. ఈ మేరకు అధికారులు రెండు ప్యాక్డ్ ఆర్బీసీ బ్యాగ్స్, ఒక ప్లాస్మా బ్యాగ్‌తో పాటు సేల్ బిల్స్, అకౌంట్ బుక్స్‌ను సీజ్ చేశారు. డీసీఏ డైరెక్టర్ జనరల్ కమలాసన్‌రెడ్డి ఆదేశాల మేరకు జరిపిన ఈ దాడుల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్లు శివ తేజ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.