China Manja | సంక్రాంతి పండుగ వేళ నిషేధిత చైనా మాంజా కారణంగా మరొకరు గాయపడ్డారు. ఉప్పల్ స్టేషన్ పరిధిలో చైనా మాంజా తగలడంతో ఏఎస్సై నాగరాజు గొంతు కోసుకుపోయింది. దీంతో తీవ్ర రక్తస్రావమైన ఏఎస్సైని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. ఉప్పల్ స్వరూప్ నగర్లో ఉంటున్న నాగరాజు నల్లకుంట పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు. ఎగ్జిబిషన్ డ్యూటీ కోసం ఉప్పల్లోని తన ఇంటి నుంచి బయల్దేరిన నాగరాజు సోమవారం సాయంత్రం బయల్దేరాడు. అదే సమయంలో పతంగుల చైనా మాంజా ఆయన మెడకు చుట్టుకుని గొంతు కోసుకుపోయింది. దీంతో తీవ్ర గాయమై.. రక్తస్రావం జరిగింది. ఇది గమనించిన స్థానికులు ఆయన్ను హుటాహుటిన ఎల్బీనగర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చైనా మాంజా కారణంగా ఓ వృద్ధురాలు గాయపడింది. అల్మాస్గూడలో రోడ్డుపక్కన యాదమ్మ (70) అనే వృద్ధురాలు నడుచుకుంటూ వెళ్తుండగా కాలికి చైనా మాంజా చుట్టుకుంది. చైనా మాంజా తగలి కాలు కోసుకుపోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. గమనించిన స్థానికులు యాదమ్మను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, చైనా మాంజా ప్రాణాల మీదకు తీసుకొస్తుందని.. దీనిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.