ఖైరతాబాద్, మే 30 : పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీలి విప్లవానికి స్వర్ణయుగమని, కేసీఆర్ మత్స్యకారుల సంక్షేమానికి పెద్ద పీట వేశారని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ అన్నారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం తెలంగాణ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు, జిల్లా అధ్యక్షులు, చీఫ్ ప్రమోటర్స్‌తో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మత్స్యకారులపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఖండించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత మత్స్యకారులకు గడ్డు కాలం మొదలైందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముదిరాజ్‌లకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా, మత్స్య పరిశ్రమను నిర్వీర్యం చేసే పని పెట్టుకున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పదేండ్ల కాలంలో చెరువులు, రిజర్వాయర్లు నిండుకుండలుగా మార్చారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నూతన రిజర్వాయర్ల నిర్మాణం, బ్యాక్ వాటర్ పెంపు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్దరణ లాంటివి చేపట్టారని, మత్స్య సహకార సంఘాలను బలోపేతం చేశారని, 33 జిల్లాల వారీగా సహకార సంఘాలు ఏర్పాటు చేశారన్నారు. 2,250 గా ఉన్న సొసైటీలను అడ్డుగా ఉన్న నిబంధనలను తొలగించి 6,500లకు పెంచారని, నేడు 4.65లక్షల సభ్యులతో సొసైటీ విరాజిల్లిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మత్స్య సంపదను పెంచడానికి అత్యధిక బడ్జెట్‌ను కేటాయించిందన్నారు.
వెయ్యి కోట్ల నిధులతో సమగ్ర మత్స్య అభివృద్ధి పథకాన్ని అమలుపర్చిందని, అలాగే ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమంతో లక్షలాది మంది మత్స్యకారులకు లబ్ది చేకూరిందన్నారు. వాటితో పాటు చేపల మార్కెటింగ్ కోసం అవసరమైన వాహనాలను కేటాయించి మత్స్యకారుల ఆర్థిక స్వావలంబనకు కృషి చేశారన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రూ.20కోట్లు మాత్రమే కేటాయించిందని, 2023-24 సంవత్సరానికి గాను చేపపిల్లలు పంపిణీ చేసిన రైతులకు దాదాపు రూ.70 కోట్లు చెల్లించాల్సి ఉండగా, 16 నెలలుగా ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు. రాష్ట్రంలోని చెరువులు, కుంటలపై ముదిరాజ్‌లు, బెస్తలకు హక్కులు ఉండే విధంగా కామారెడ్డి డిక్లరేషన్‌లో హామీ ఇచ్చి విస్మరించారన్నారు.
అందాల పోటీలకు రూ.200 కోట్లు పెట్టిన ప్రభుత్వం సంపదను పెంచే మత్స్యకారులకు కనీసం రూ.100కోట్లు కేటాయించకపోవడం విచారకరమన్నారు. 1025 నమోదిత ప్రాథమిక మతస్స్యకారుల సహకార సంఆలకు ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. వానా కాలం ప్రారంభమైన నేపథ్యంలో ఉచిత చేప పిల్లల పంపిణీకి కనీసం టెండర్లు కూడా పిలువకపోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్దికి అద్దంపడుతుందన్నారు. తక్షణమే చేపపిల్లల పంపిణీ చేయాలని, ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, లేని పక్షంలో మత్స్యశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, ప్రభుత్వాన్ని ఎండగడుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు బి. సత్తయ్య, లక్ష్మణ్, సమ్మయ్య, బాలు ముదిరాజ్, యాదగిరి, మేడ్చల్, జనగామ జిల్లా ఫిషరీస్ సొసైటీ చైర్మన్లు మన్నె రాజు, నీల రాజు, వెంకటేశ్, రాజ్ కుమార్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.