సిటీబ్యూరో/ఆదిబట్ల, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ట్రై పోలీస్ కమిషనరేట్ల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పాటైన మల్కాజిగిరి కమిషనరేట్ పోలీస్ కమిషనర్‌గా అవినాష్ మహంతి మంగళవారం బాధ్యతలు తీసుకున్నారు. అలాగే సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఎం. రమేష్‌రెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. డీజీ కార్యాలయంలో ప్రొవిజనింగ్ అండ లాజిస్టిక్, పోలీస్ ట్రాన్స్‌పోర్టు అర్గనైజేషన్ ఐజీగా పనిచేసిన రమేష్‌రెడ్డిని సోమవారం ప్రభుత్వం సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మంగళవారం ఆయన అవినాష్ మహంతి నుంచి సైబరాబాద్ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్నారు.
కలెక్టరేట్లో ప్రత్యేక చాంబర్
ఆదిబట్ల, డిసెంబర్ 30: ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్‌గా మంగళవారం సాయంత్రం సుధీర్‌బాబు బాధ్యతలు స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయనకు ప్రత్యేక చాంబర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు మంత్రాలతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం బాధ్యతలు స్వీకరించానని తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా కొత్తగా నాలుగు పోలీసు కమిషనరేట్లను ఏర్పాటు చేశారని, అందులో భాగంగా నేను ఈ రోజు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించానని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు బాధ్యతలను నిర్వహిస్తానన్నారు. అన్నీ శాఖల సమన్వయంతో పని చేస్తామని, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో 22 పోలీస్ స్టేషన్లు పని చేస్తాయని, ఈ పోలీస్ స్టేషన్ల అధికారులతో కలిసి టీమ్ వర్క్‌తో సమర్ధవంతంగా పని చేస్తామన్నారు. తనకు ఈ అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.