Apaar ID | సిటీబ్యూరో, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : ఒకే దేశం ఒకే ఐడీలో భాగంగా ప్రతీ విద్యార్థికి అపార్ (ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రి) ఐడీ నమోదు చేసే ప్రక్రియను విద్యాశాఖ వేగవంతం చేయడానికి సిద్ధమైంది. అయితే అపార్ ఐడీ నమోదుకు క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని టీచర్లు చెబుతున్నారు. విద్యార్థుల పేర్లు ఆధార్లో ఒకలా.. స్కూల్ రిజిస్టర్లో మరోల ఉండటం వల్ల ఆ పేర్లను ఎలా ఎంటర్ చేయాలనే దానిపై గందరగోళ పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఇందుకోసం విద్యార్థి పేరు ఏ విధంగా ఎంటర్ చెయ్యాలో చెప్పాలని కోరుతూ తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రం కోరుతున్నారు.
దీంతో పాటు ఆ పేరుకు సంబంధించిన గుర్తింపు కార్డును కూడా జత చేయాలని స్కూళ్ల నిర్వాహకులు చెప్పడంతో తల్లిదండ్రులు ఆధార్ కార్డులో పేరు మార్పుల కోసం సమయం పడుతుందని సమాధానమిస్తున్నారు. ఈ క్రమంలో అపార్ నమోద ప్రక్రియకు గడువు పొడిగించాలని స్కూళ్ల నిర్వాహకులు విద్యాశాఖను కోరాయి. ఇటీవల జనవరి 31 వరకు హైదరాబాద్లో అపార్ ఐడీ నమోదు గడువుగా పెట్టారు. కానీ ఇప్పుడు ఆ సమయం మరింత పొడిగించాలని డిమాండ్లు వ్యక్తమయ్యాయి.