సిటీబ్యూరో, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఆఫీసుల ఏర్పాట్లతో అధికారులంతా తలమునకలయ్యారు. జీహెచ్ఎంసీలో 27 పురపాలికల విలీనం తర్వాత 150 వార్డులతో ఉన్న జీహెచ్ఎంసీ 300 వార్డులుగా, 60 సర్కిళ్లు, 12 జోన్లుగా అవతరించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీని విభజించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రస్తుత 300 వార్డులలో 150 వార్డులతో జీహెచ్ఎంసీ, 74 వార్డులతో గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ , మరో 76 వార్డులతో గ్రేటర్ మల్కాజిగిరి కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారు.
ఇందుకు సంబంధించిన ఆఫీసు కార్యాలయాల ఏర్పాటు పనులపై దృష్టి సారించారు. మణికొండలో గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గతంలో హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయంగా ఉన్న తార్నాకలోని హుడా కాంప్లెక్స్‌లో గ్రేటర్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంగా మార్చనున్నట్లు తెలుస్తున్నది. కాగా, తెల్లాపూర్, శేరిలింగంపల్లి కార్యాలయాలతో పాటు నార్సింగి సర్కిల్ కార్యాలయాన్ని అధికారులు పరిశీలించారు. ఈ కార్యాలయాన్ని నూతన గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంగా ఏర్పాటు చేయడానికి అనువైనదిగా తేల్చారు.