సిటీబ్యూరో, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): పేదలకు దసరా కానుకగా సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇచ్చారని, పేద, మధ్య తరగతి ప్రజల సొంతింటి స్వప్నం సాకారమైందని, ఇది సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మేడ్చల్ నియోజకవర్గంలోని కొర్రెముల (వెంకటాపురం)లో 6 ఎకరాల్లో నిర్మించిన 800 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు.
అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. లబ్ధిదారులపై ఒక్క రూపాయి భారం లేకుండా అన్ని రకాల సౌకర్యాలతో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఉచితంగానే ఇస్తున్నది దేశంలోని ఏకైక రాష్ట్రం ఒక్క తెలంగాణే అని అన్నారు. సొంత ఇల్లు లేని పేద, మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలన్న సీఎం కేసీఆర్ సంకల్పంతోనే డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ కార్యక్రమం ప్రారంభమైందన్నారు. ఇండ్ల పంపిణీ కూడా ఎంతో పారదర్శకంగా, పార్టీలకు అతీతంగా, ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా జరిగిందన్నారు. కార్యక్రమంలో వెంకటాపురం గ్రామ సర్పంచ్ గీతా శ్రీనివాస్, ఎంపీటీసీ రామారావు, హౌసింగ్ కార్పొరేషన్ సీఈ సురేశ్, ఈఈ వెంకటదాసురెడ్డి, తహసీల్దార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.