సిటీబ్యూరో, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్లతో చేతులు కలిపి, డ్రగ్ కొరియర్‌గా మారిన రాజస్థాన్‌కు చెందిన ఒక హోంగార్డుతో పాటు కామారెడ్డికి చెందిన మరో వ్యక్తిని జూబ్లీహిల్స్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 10 లక్షల విలువైన 215 ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను వెస్ట్‌జోన్ డీసీపీ జోయెల్ డేవీస్, టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు సోమవారం జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రాజస్థాన్, ప్రతాప్‌ఘర్ ప్రాంతానికి చెందిన ప్రదీప్ శర్మ అలియాస్ కమల్ రాణా అక్కడి స్థానిక పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా కొన్నాళ్ల పాటు అక్కడి చెక్ పోస్టుల్లో బాధ్యతలు నిర్వహించాడు.
ఆ సమయంలో పాకిస్థాన్‌తో పాటు పంజాబ్ నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ జరిగింది. ప్రదీప్ శర్మకు అంతర్జాతీయ స్థాయి డ్రగ్ స్మగ్లింగ్ ముఠాలతో పరిచయాలు ఏర్పడ్డాయి. తనకు మరింత కమీషన్ ఇస్తే కొరియర్‌గా పనిచేస్తూ వివిధ ప్రాంతాలకు డ్రగ్ సరఫరా చేస్తానంటూ ఒప్పందం చేసుకున్నాడు. మూడేండ్లుగా వివిధ ప్రాంతాలకు డ్రగ్ స్మగ్లింగ్ చేస్తున్నాడు. చెక్‌పోస్టులలో తాను హోంగార్డును అంటూ పోలీసు గుర్తింపు కార్డు చూపిస్తూ సునాయసంగా డ్రగ్స్‌ను రవాణా చేస్తున్నాడు. ఇదిలాఉండగా.. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పెద్దదెవాడ గ్రామానికి చెందిన మతంవారు వీరేంద్ర గతంలో కారు డ్రైవర్‌గా పనిచేశాడు. ట్రావెల్ కారు డ్రైవర్ కావడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లాడు. ఇందులో భాగంగానే రాజస్థాన్‌కు వెళ్లిన సమయంలో ప్రదీప్ శర్మతో పరిచయం ఏర్పడింది.
ఇద్దరు మాట్లాడుకున్నారు, ప్రదీప్ శర్మ డ్రగ్ కొరియర్ అని తెలియడంతో అతడితో దోస్తీ చేయాలని వీరేంద్ర నిర్ణయించుకున్నాడు. తాను హైదరాబాద్‌లో డ్రగ్ విక్రయిస్తానని.. తనకు మాదక ద్రవ్యాలు తీసుకొచ్చి ఇవ్వాలంటూ కోరాడు. ప్రదీప్ శర్మ ఒప్పుకోవడంతో గతేడాది 70 గ్రాముల ఎండీఎంఏ తెచ్చి వీరేంద్రకు హైదరాబాద్‌లో ఇచ్చి వెళ్లాడు. దానిని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు వీరేంద్ర, నరేశ్ చౌదరిని అరెస్టు చేశారు. ఈ కేసులో హోంగార్డు ప్రదీప్ శర్మ వాంటెడ్‌గా ఉన్నాడు. ఈ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన వీరేంద్ర తిరిగి ప్రదీప్ శర్మకు డ్రగ్ ఆర్డర్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో 215 ఎండీఎంఏ డ్రగ్ పౌడర్‌తో బస్సులో రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు ప్రదీప్ చేరుకున్నాడు. వీరి కదలికలపై నిఘా పెట్టిన సౌత్-వెస్ట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్-5లో మాదక ద్రవ్యాలను ఒకరి నుంచి మరొకరు తీసుకుంటుండగా పోలీసులు పట్టుకున్నారు. వీరేంద్ర ఒక్కో గ్రాము డ్రగ్‌ను రూ.10 వేలకు విక్రయించేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు.