సిటీబ్యూరో, డిసెంబర్ 10(నమస్తే తెలంగాణ): నగరానికి చెందిన పేమెంట్ గేట్‌వే సంస్థ పూల్ ఖాతా నుంచి ఒకే రోజు రూ. 1.5 కోట్లు కాజేసిన ఘటనలో ఐదుగురు ఒడిశాకు చెందిన సైబర్నేరగాళ్లను సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జాయింట్ సీపీ అవినాశ్ మహంతి కథనం ప్రకారం.. భువనేశ్వర్‌కు చెందిన గోబినాథ్ చంద్ర జీనా స్టార్ గ్లో ఎలక్ట్రికల్ పేరుతో సర్వీసెస్, సేల్స్, స్వతహాగా సీఎఫ్ఎల్ బల్బులను తయారు చేస్తాడు. పేమెంట్ గేట్‌వేలో ఖాతా తెరవడం ద్వారా నెలకు రూ. 30 వేల వరకు సంపాదింవచ్చని టెలీగ్రామ్‌లో పరిచయమైన రాజ్ అనే వ్యక్తి సూచించాడు. దీంతో గోబినాథ్ తన పాన్, ఆధార్, ఇతర వివరాలన్నీ అతడికి అందించాడు. ఆ వివరాలతో రాజ్.. బంజారాహిల్స్‌లోని పేమెంట్ గేట్‌వే సంస్థలో అకౌంట్ తెరిచాడు.
ఆ సమయంలో గోబినాథ్ జీ మెయిల్ ఐడీ ఇవ్వడంతో దానికి యూజర్ ఐడీ, పాస్వర్డ్లు పేమెంట్ గేట్‌వే సంస్థ పంపించింది. ఇదిలా ఉండగా, గోబినాథ్ చంద్రతో మాట్లాడి అతడితో పాటు తెలిసిన వారి బ్యాంకు ఖాతాలు కావాలని కోరడంతో భువనేశ్వర్‌కు చెందిన బిమ్లా ప్రసాద్ సమంతా రాయ్, బలాభద్ర దాస్, దినేశ్ మహంతి, మనోజ్‌కుమార్ రోట్ల బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలను రాజ్‌కు పంపించాడు. ఒక రోజు తన వద్ద ఉన్న పాస్వర్డ్, యూజర్ ఐడీ ద్వారా పేమెంట్ గేట్‌వే పూల్ఖాతాలో నుంచి ఒకే రోజు రూ. 1.5 కోట్లు కాజేసిన రాజ్ .. నలుగురు స్నేహితుల ఖాతాలోకి నగదు బదిలీ చేశాడు. ఆ ఖాతాలో నుంచి మరో ఆరు ఖాతాలకు, అక్కడి నుం చి మరిన్ని అకౌంట్లకు డబ్బులు పంపించాడు. పేమెంట్ గేట్‌వే సర్వర్ ఇచ్చిన అలర్ట్‌తో ఆ ఖాతాలను నిలిపివేసి.. సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇన్స్పెక్టర్ కృష్ణ నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేపట్టింది. గోబినాథ్తో పాటు మరో నలుగురిని ఒడిశాలో పట్టుకొని నగరానికి తరలించింది. శుక్రవారం వారిని కోర్టులో హాజరుపరిచారు.