హిమాయత్‌నగర్, జూన్24: జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలు, సెల్ఫోన్లను తస్కరించి తప్పించుకుని తిరుగుతున్న ముగ్గురిని (మైనర్లు) పోలీసులు అరెస్టు చేసి, జువైనల్ హోంకు తరలించారు. ఈ ఘటన నారాయణగూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. సోమవారం నారాయణగూడ పీఎస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుల్తాన్‌బజార్ ఏసీపీ కె.శంకర్, ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, డీఎస్సై వెంకటేశ్‌తో కలిసి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సైదాబాద్ ప్రాంతానికి చెందిన ఈ ముగ్గురు మైనర్లు జల్సాలకు అలవాటు పడి గంజాయి, మద్యం సేవించేందుకు చోరీలు చేయడం మొదలు పెట్టారు. కాగా, రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్‌కు చెందిన సంతోష్ ఆటో డ్రైవర్. ఈ నెల 21న హిమాయత్‌నగర్‌లోని మలబార్ గోల్డ్ దుకాణం సమీపంలో ఆటో పార్కింగ్ చేసి చేతిలో సెల్‌ఫోన్ పట్టుకుని కూర్చున్నాడు. చోరీ చేసిన ద్విచక్ర వాహనంపై ఈ ముగ్గురు మైనర్లు సంతోష్ వద్దకు వెళ్లారు.
అతడి చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ను లాక్కొని పారిపోయారు. సంతోష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకుని ఘటనా స్థలంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నారాయణగూడ వైఎంసీఏ చౌరస్తాలో వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఈ ముగ్గురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. ఈ ముగ్గురు నిందితులు పాత నేరస్తులను తేలింది. గతంలో కూడా జైలుకు వెళ్లి వచ్చారు. అయినా బుద్ధి మారలేదు. ఈ ముఠా బైక్‌లను అపహరించడంతో పాటు పార్కింగ్ చేసిన వాహనాల నుంచి పెట్రోల్‌ను కూడా దొంగిలించి చోరీ చేసిన వాహనాలపై దర్జాగా తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. దొంగలించిన సొత్తును విక్రయించగా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేశారు. వీరి వద్ద నుంచి ఒక సెల్‌ఫోన్, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని జువైనల్ హోంకు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. డీఎస్సై వెంకటేశ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.