శేరిలింగంపల్లి, ఏప్రిల్ 15: గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసిన ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయి విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో ఎస్వోటీ, గచ్చిబౌలి పోలీసులు గచ్చిబౌలి మసీదుబండ కొండాపూర్‌లో సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ప్రేమ్ ప్రకాష్‌చౌదరి (43) అనే వ్యక్తి గంజాయి చాక్లెట్లను విక్రయిస్తుండడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 1227 గ్రాముల గంజాయి చాక్లెట్లను, 147 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కొల్తూరులో గంజాయి ముఠా అరెస్ట్
శామీర్‌పేట, ఏప్రిల్ 15: జినోమి వాలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొల్తూరు గ్రామంలో గంజాయి అక్రమంగా నిల్వ చేసి విక్రయిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ గోపగాని గురువయ్య తెలిపారు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు, ప్రత్యేక దళం (ఎస్వోటీ) సంయుక్తంగా దాడులు నిర్వహించి ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అరెస్టు చేసిన వారిలో కార్తీక్, సంజయ్ కుమార్, యుగేందర్‌రెడ్డి, రవి, మధులు గంజాయి విక్రయానికి పాల్పడుతుండగా, ప్రశాంత్ గంజాయి సేవిస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి మొత్తం 2.800 కిలోల గంజాయి, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
విచారణలో నిందితులు ఒడిశా రాష్ట్రంలోని రాయ్‌ఘడ్ ప్రాంతం నుంచి తకువ ధరకు గంజాయి కొనుగోలు చేసి రైలు మార్గంలో హైదరాబాద్‌కు తరలించి, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నారని వివరించారు. ఈ కేసులో గంజాయి సరఫరా చేసిన శంకర్ శెట్టి సహా మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితులపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి న్యాయస్థానానికి తరలించినట్లు సీఐ గోపగాని గురువయ్య పేరొన్నారు. పరారీలో ఉన్న వారిని త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు.