సిటీబ్యూరో, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నామని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. గురువారం ఈ రెండు పండుగలకు సంబంధించిన భద్రత మరియు బందోబస్తు ప్రణాళికలను సమీక్షించడానికి అధికారులతో సీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
6న నిమజ్జనం జరుగుతుందని సుమారుగా 40 గంటలపాటు నిమజ్జనం కొనసాగుతుందని, ఇందుకోసం అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. నిమజ్జనం రోజు కేంద్రహోం మంత్రి అమిత్‌షా ఎంజే మార్కెట్లోని ఒకర్యాలీలో పాల్గొననున్నందున అందుకు తగిన ఏర్పాట్లు చేస్తూ భద్రతను పెంచామని సీపీ తెలిపారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ బృందాలు తమ పర్యవేక్షణను పెంచాలని ఆదేశాలు ఇచ్చామని నిమజ్జనం ఊరేగింపు మార్గమధ్యలో బషీర్‌బాగ్, ఎంజే మార్కెట్ వంటి పెద్ద కూడళ్ల వద్ద ట్రాఫిక్ ప్రణాళికను పటిష్టం చేస్తున్నట్లు చెప్పారు.
మండప నిర్వాహకులు ఎటువంటి ఆలస్యం లేకుండా విగ్రహాలను నిమజ్జనం చేయాలని కోరుతూ విగ్రహాలను తీసుకొని వచ్చిన వారికి అవసరమైన అన్ని లాజిస్టికల్ మద్దతు అందించాలని పోలీసులను ఆదేశించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో లా అండ్ ఆర్డర్ అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్, డీసీపీలు అపూర్వరావు, పుష్ప, స్మిత్,క్రైమ్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తదితరులు పాల్గొన్నారు.
క్షేత్ర స్థాయి అధికారులతో సమీక్షలు
ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో పర్యటిస్తూ ఎక్కడికక్కడ స్థానిక పోలీసు అధికారులతో నిమజ్జనం ఏర్పాట్లు, బందోబస్తుకు సంబంధించిన అంశాలను ఆరా తీస్తూ వారికి తగిన సూచనలు చేస్తున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సరూర్‌నగర్, కాప్రా, సఫిల్‌గూడ, రాంపల్లి, తుర్కయంజాల్ తదితర ప్రాంతాల్లోని చెరువుల వద్ద నిమజ్జనాలకు ఏర్పాట్లు చేశారు.
గ్రామీణ ప్రాంతాలు కూడా ఉండడంతో ఆయా గ్రామాల పరిధిలో ఉండే చెరువులు, కుంటలలోనూ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతుంటాయి. నిమజ్జనాల సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా నిమజ్జన ఊరేగింపులు నిర్వహించేలా ఇప్పటికే ఆయా మండపాల నిర్వాహకులు, స్థానిక పోలీసులు సమావేశాలు ఏర్పాటు చేసి సూచనలు చేశారు. దీంతో పాటు నిమజ్జన కేంద్రాల వద్ద ఆయా ప్రభుత్వ అధికార విభాగలతో సమన్వయం చేసుకుంటూ అక్కడ కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో పోలీసులు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు.
వివిధ ప్రాంతాల నుంచి బస్సులు
ట్యాంక్‌బండ్ వద్ద శనివారం వైభవంగా జరిగే గణేశ్ నిమజ్జనోత్సవానికి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 600 బస్సులు సమకూరుస్తున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా వివిధ మార్గాల నుంచి బషీర్‌బాగ్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఇందారాపార్క్, లక్డీకాపూల్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో బస్సులు నిలుస్తాయని వివరించారు.
36 గంటలు మద్యం దుకాణాలు బంద్
గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు మధ్యం దుకాణాలు మూసీవేయాలని ఆయా పోలీస్ కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు. మద్యం, కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు తప్పని సరిగా ఈ ఉత్తర్వులను అమలు చేయాలని, నిబంధనలు ఉల్లఘించే వారిపై చర్యలు తీసుకుంటామని సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు వేర్వేరు ప్రకటనలో వెల్లడించారు. ఇదిలాఉండగా ఈ ఉత్తర్వులు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని భువనగిరి జోన్‌కు వర్తించదని రాచకొండ సీపీ తెలిపారు.
బడా గణేశ్‌ను దర్శించుకున్న 45 లక్షల మంది
ఖైరతాబాద్: ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని నవరాత్రుల్లో సుమారు 45 లక్షల మంది దర్శించుకున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. ప్రతి రోజూ 3 లక్షలకు పైగా, వారాంతరంలో 5 లక్షల వరకు దర్శించుకున్నట్లు చెబుతున్నారు. గణపతిని దర్శించుకునేందుకు లక్షలాదిగా తరలిరాగా, తోపులాటలు చోటు చేసుకోవడంతో క్యూలైన్లలో పలువురు సొమ్మసిల్లిపడిపోయినట్లు వదంతులు వ్యాపించాయి. సుమారు 700 మంది పోలీసులను మోహరించగా, పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులను అదుపు చేయడంలో సిబ్బంది కొంత ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అంబులెన్సులు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. మహాగణపతి దర్శనాలు శుక్రవారం ఉదయం నుంచి నిలిపివేస్తున్నట్లు ఉత్సవ కమిటీ పేర్కొంది. గురువారం సాయంత్రం నుంచే నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. శోభాయాత్రకు వినియోగించే భారీ ట్రాలీకి వెల్డింగ్ పనులు ప్రారంభించారు. శనివారం 6.30గంటలకే శోభాయాత్ర ప్రారంభించి, మధ్యాహ్నం 1.30 గంట వరకు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.
12వేల మందితో బందోబస్తు
సిటీబ్యూరో, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ) : రాచకొండ కమిషనరేట్ పరిధిలో 12వేల మంది పోలీసు సిబ్బందితో నిమజ్జన ప్రక్రియకు బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా సీపీ సుధీర్ బాబు తెలిపారు. నిమజ్జన ప్రక్రియ బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించిన ఆయన… సరూర్ నగర్ చెరువును సందర్శించారు.
అనంతరం మాట్లాడుతూ ఇప్పటివరకు 3వేల విగ్రహాలను నిమజ్జనం చేయగా… మరో 20 వేల గణనాథుల నిమజ్జనానికి అవసరమైన ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఎలాంటి ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ ఇబ్బందులు లేకుండా, మెడికల్ ట్రీట్మెంట్ బృందాలు కూడా సిద్ధంగా ఉంచామన్నారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. సరూర్ నగర్ చెరువులో బోట్లో ప్రయాణించి పరిసరాలను పరిశీలించి, పలు భద్రత సూచనలను అధికారులకు చేశారు. ఆయన వెంట డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు ఉన్నారు.