గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పారిశుధ్య నిర్వహణ మెరుగుకు జీహెచ్ఎంసీ పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. ఈ మేరకు స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటికీ చెత్త సేకరణను మరింత పక్కగా నిర్వహించేందుకు దృష్టి సారించింది. ఇప్పటికే స్వచ్ఛ ఆటోల పనితీరు పర్యవేక్షణకు జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రత్యేక కమిటీని వేశారు. ప్రతి రోజూ ఉదయం 6గంటలకు క్షేత్రస్థాయిలో పర్యటించే ఈ కమిటీ సభ్యులు, వారంలో మూడుసార్లు ఆకస్మిక తనిఖీలు చేస్తారు. అంతేకాకుండా స్వచ్ఛ ఆటో డ్రైవర్లకు విధుల్లో చేరే ముందు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయటం తప్పనిసరి చేశారు. దీనివల్ల ప్రస్తుతం 94 శాతం హాజరు శాతం కొనసాగుతున్నదని, 100 శాతం సాధించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
సిటీబ్యూరో, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పారిశుధ్య నిర్వహణ మరింత పకడ్బందీగా చేపట్టేందుకు జీహెచ్ఎంసీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా చెత్త సేకరణ సామర్థ్యాన్ని పెంచింది. అధికారులు క్షేత్రస్థాయిలో విధానపరమైన లోపాలను సవరించడం, స్వచ్ఛ ఆటోల పనితీరును మెరుగపర్చడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే స్వచ్ఛ ఆటోల పనితీరుపై డివిజన్లలో కాలనీ, బస్తీల్లో సమావేశాలు నిర్వహిస్తుండగా, ప్రత్యేక తనిఖీలకు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.
ముఖ్య వైద్యాధికారి, ముగ్గురు జాయింట్ కమిషనర్లు (జేసీ), సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ), ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ) ఈ కమిటీ బృందంలో ఉన్నారు. ఈ బృందం స్వచ్ఛ ఆటోల పనితీరుపై మరింత మెరుగు పడేలా తాజాగా క్యూఆర్ కోడ్ విధానాన్ని తెరపైకి తీసుకువచ్చి అమలు చేస్తున్నారు. రోజూ విధుల్లో చేరే సమయంలో సంబంధిత స్వచ్ఛ ఆటో డ్రైవర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. సంబంధిత ఇన్చార్జిలు, ఎస్ఎఫ్ఏలను నిరంతరం పర్యవేక్షణలో క్యూఆర్ స్కాన్ ప్రక్రియ జరుగుతుంది. ప్రస్తుతం 94 శాతం హాజరు శాతం కొనసాగుతుందని, 100శాతం సాదించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
గ్రేటర్లో 6,500 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఈ వ్యర్థాలను 4,391 స్వచ్ఛ ఆటోలు, పలు ట్రక్కులు ఇంటింటి నుంచి సేకరిస్తున్నాయి. కానీ కొందరు స్వచ్ఛ ఆటో డ్రైవర్లు క్షేత్రస్థాయిలో రోజూ విధుల్లో పాల్గొనడం లేదు. దీంతో సంబంధిత గృహస్తులు ఇంటి వ్యర్థాలను రోడ్లపై పడేస్తున్నారు. ఇలా వేసిన చెత్తను పోగు చేసి వాహనాల ద్వారా జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. విధానపరమైన లోపాలు, స్వచ్ఛ ఆటోల పనితీరులో నిర్లక్ష్యం కారణంగా పారిశుధ్య నిర్వహణపై విపరీతమైన ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ 8 మంది అధికారులతో ప్రత్యేక కమిటీ వేశారు. శేరిలింగంపల్లికి శశిరేఖ/జాయింట్ కమిషన్ (జేసీ), సికింద్రాబాద్‌కు ఉమాప్రకాశ్/ జేసీ, ఖైరతాబాద్‌కు సంధ్య/జేసీ , చార్మినార్- సంతోష్ /ఏసీ (అదనపు కమిషనర్), భరత్ /పీఓ, కూకట్పల్లి-కోటేశ్వర్ రావు/ఎస్ఈ, శ్రీనివాస్ రెడ్డి /ఈఈ, ఎల్బీనగర్కు డాక్టర్ పద్మజ/సీఎంఓహెచ్‌ను నియమించారు. రోజూ ఉదయం ఆరు గంటలకు వీరంతా క్షేత్రస్థాయిలో పర్యటించి తగు చర్యలు చేపట్టనున్నారు. వారంలో మూడు రోజుల పాటు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నివేదిక సమర్పిస్తున్నారు.
పారిశుధ్య నిర్వహణ ప్రక్రియ ఇలా…