బల్క్ కనెక్షన్లకు దరఖాస్తు చేసుకున్న వినియోగదారులను జలమండలి అధికారులు తీవ్రంగా వేధిస్తున్నారు. లక్షలాది రూపాయలు చెల్లించి నెలలు గడుస్తున్నా కనెక్షన్ ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్క వినియోగదారుడు ఆరేడు నెలల కిందటే కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోగా ఇంప్రూవ్మెంట్ చార్జీలు వసూలు చేశారు. వినియోగదారుల నుంచి చార్జీలు వసూలు చేసినంత శ్రద్ధ కనెక్షన్ ఇవ్వడంలో మాత్రం చూపడం లేదు.
– సిటీ బ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ)
బోర్ల ద్వారా వచ్చే నీళ్లు సరిపోక పోవడంతో గడిచిన మూడు నెలల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవికి ముందు జలమండలి విస్తరణ పనుల్లో బిజీగా ఉన్నామని సాకుగా చూపి కనెక్షన్లు ఇవ్వడంలో జాప్యం చేశారు. ఆ తర్వాత వేసవి పేరు చెప్పి మరో మూడు నెలలుగా పక్కన పెట్టారు. వేసవి పూర్తయి వర్షాకాలం వచ్చింది. ఇప్పటికైనా తమ కనెక్షన్లకు మోక్షం కలిగిస్తారా? అని ఇంప్రూవ్మెంట్ చార్జీలు చెల్లించిన వినియోగదారులు ఎదురు చూస్తున్నారు. కొంత మంది బల్క్ కనెక్షన్దారులు ఆరు నెలల కిందటే లక్షలాది రూపాయలు చెల్లించి జలమండలి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వేసవికి ముందు దరఖాస్తు చేసుకున్నవారి కనెక్షన్లకు కూడా ఇంకా టెండర్ ప్రక్రియ చేపట్టకపోవడంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు.
డయా కలిగిన పైపులైన్ కనెక్షన్ కేటగిరీ-3 కిందకు వస్తుంది. ఈ కనెక్షన్లు హైరై జ్డ్ భవనాలు, పరిశ్రమలు, కమర్షియల్ కంపెనీలకు ఇస్తారు. ఇందుకోసం వారి నుంచి ఫీజబిలిటీ చేసుకుని నీటి వినియోగం సామర్థ్యాన్ని బట్టి ఇంప్రూవ్మెంట్ చార్జీలు వసూలు చేస్తారు. ఆ తర్వాత వారందరికీ కనెక్షన్ పైప్లైన్ వేసేందుకు టెండర్లు ఆహ్వానిస్తారు. టెండర్లు పూర్తయ్యాక సంబంధిత కాంట్రాక్టర్ ఆయా భవనాలు, పరిశ్రమలకు నల్లా కనెక్షన్ ఇస్తారు. కొత్త కనెక్షన్లు ఎండాకాలంలో ఇవ్వకూడదనే నిబంధన ఉంది. కానీ వందలాది మం ది వినియోగదారులు ఆరు నెలల నుం చి ఏడాది క్రితం నుంచే కనెక్షన్ దరఖాస్తు చేసుకుని లక్షలాది రూపాయలు చెల్లించి నిరీక్షిస్తున్నారు. కానీ జలమండలి అధికారులు మాత్రం ఇప్పటి వర కు టెండర్లు కూడా పిలువలేదు. గతంలో ఈ టెండర్ ప్రక్రియను రెవె న్యూ విభాగం నిర్వహించేది. జలమండలి విస్తరణకు ముందు దాన్ని ఆయా జోన్ల పరిధిలోనే జరిగేలా సవరించారు. కానీ ఇప్పటి వరకు టెండర్ ప్రక్రియ చేపట్టలేదు. ఎండాకాలం ముగిసింది. ఇప్పటికైనా టెండర్లు పిలి చి నెలల తరబడిగా ఎదురు చూస్తు న్న వినియోగదారులకు ఊరట కలిగించాలని కోరుతున్నారు.