ఖైరతాబాద్, ఏప్రిల్ 26 : దొంగతనం కేసులో పోలీసులు ఓ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను అరెస్ట్ చేసి, మరొకరికి నోటీసులు జారీ చేశారు. పంజాగుట్ట సీఐ శోభన్ వివరాల ప్రకారం…. పంజాగుట్ట ద్వారకాపురి కాలనీలో నివాసం ఉండే ఎ. పురుషోత్తం రెడ్డి హైకోర్టులో అడ్వకేట్‌గా పనిచేస్తున్నాడు. 2007లో జె. భార్గవి అలియాస్ రోహిణిని కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు సతానం. భార్య భార్గవి సికింద్రాబాద్ కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తోంది.
గత కొంత కాలంగా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. భర్తపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పలు దఫాలుగా 498ఏ (ఐపీసీ), సెక్షన్ 3 అండ్ 4 ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టింది. ఈ కేసులను హైకోర్టులో కొట్టివేశారు. తదానంతరం కూడా తరచూ పోలీసులకు ఫిర్యాదు చేస్తుండేది. గత నెల 2న తనకు విడాకులు ఇవ్వాలని, లేకుంటే పిల్లలకు విషం పెట్టి తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దీంతో ఫ్యామిలీ కోర్టులో భర్త డైవర్స్ కోసం దరఖాస్తు చేశాడు.
కాగా, గత నెల 30న ఇంటో దాచిన రూ.3.2కోట్ల నగదు, విలువైన బంగారు ఆభరణాలు, పాస్‌పోర్టులు తన భార్య తీసుకెళ్లినట్లు గుర్తించిన పురుషోత్తంరెడ్డి గుర్తించాడు. ఆరాతీయగా డబ్బులు నగలు జహీరాబాద్‌లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేసే అరవింద్ కుమార్‌కు ఇచ్చినట్లు గుర్తించాడు.పోలీసులకు ఫిర్యాదు చేయగా శనివారం రాత్రి అరవింద్ కుమార్‌ను అరెస్టు చేసి భార్య భార్గవికి 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు.